×
New!

Bayan Al Islam Encyclopedia Mobile Application

Get it now!

ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న కొన్ని అపార్థాలు (తెలుగు)

Description

ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ప్రజలలో వ్యాపించి ఉన్న కొన్ని అపార్థాలలోని నిజానిజాల గురించి ఇక్కడ చక్కటి ప్రామాణిక ఆధారాలతో చర్చించడం జరిగింది.

Download Book

    ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న కొన్ని అపార్థాలు

    వాస్తవానికి ఇస్లాం గురించి మీకేమి తెలుసు ?

    ఇస్లాం ధర్మం ప్రపంచంలోని అతి పెద్ద ధర్మాలలోని ఒక పెద్ద ధర్మం. అయినా అత్యధికంగా అపార్థాలకు గురవుతున్నది. రాజకీయ, ఆర్థిక, పక్షపాతంతో వ్యవహరించే మీడియా మరియు ఇతర భయాల వంటి అనేక కారణాలు ఉన్నాయి – ఇస్లాంకు వ్యతిరేకంగా అనేక అసత్యాలు మరియు అపార్థాలు వ్యాపింపజేయబడినాయి. ఇస్లాం మరియు ముస్లింల గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా స్టీరియో టైపు అసత్య ప్రచారాలను నమ్మటం మాని, ప్రతి విషయాన్ని ఇస్లామీయ బోధనల మరియు ప్రామాణిక ఆధారాల వెలుగులో పరిశీలించాలి.

    1వ అపార్థం – “ముస్లింలు ఉత్తమమైన మరియు దివ్యమైన విలువలను ముస్లిమేతరులతో పంచుకోరు”

    “మీలో ఎవరైతే ఉత్తమ గుణగణాలు మరియు నడత కలిగి ఉంటారో అలాంటి వారే ఉత్తములు.” – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.

    ఇస్లామీయ విలువలు మర్యాదగల పాశ్చాత్య విలువలతో సరితూగవని కొందరు ఆరోపిస్తున్నారు. అలాంటి ఆరోపణలు సత్యానికి చాలా దూరంగా ఉన్నాయి.

    ముస్లింలు ఉత్తమ మరియు ప్రసిద్ధ విలువలను కాపాడుతూ వచ్చినారు. ఉదాహరణకు:

    · నిజాయితీ మరియు న్యాయంగా ఉండటం.

    · ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం

    · ధార్మిక స్వేచ్ఛను అనుమతించడం

    · తల్లిదండ్రులను, బంధువులను, ఇరుగు పొరుగువారిని మరియు వృద్ధులను గౌరవించడం

    · దానధర్మాలు చేస్తూ ఉదారంగా ప్రవర్తించడం, బీదసాదలకు మరియు అక్కరగలవారికి చేతనైనంత సహాయం చేయడం

    · అబద్ధాలు, మోసం, అసత్య ప్రమాణాలు, చాడీలు, అపనిందలు మొదలైన వాటికి దూరంగా ఉండటం.

    ముస్లింలు సామాజిక పనులలో సానుకూలంగా పాల్గొనవలసి ఉన్నది. ముస్లింలు స్వయంగా ఎల్లప్పుడూ అత్యంత ఉన్నతమైన నైతిక విలువలు మరియు అత్యంత ఉత్తమమైన ఆచరణలు ప్రదర్శించవలసి ఉన్నది.

    2వ అపార్థం – “ముస్లింలు ఒక నూతన దేవుడైన అల్లాహ్ ను ఆరాధిస్తారు”

    నూహ్, అబ్రహాం, మోసెస్ మరియు జీసస్ అలైహిస్సలాం మొదలైన ప్రవక్తలు ఆరాధించిన దేవుడినే ముస్లింలు ఆరాధిస్తున్నారు. సింపుల్ గా అల్లాహ్ అనే పదం అరబీ భాషలో ఏకైక ఆరాధ్యుడి పేరు. ఇది ఎంతో విస్తృతమైన పదం – కేవలం ఒకే ఒక్క ఆరాధ్యుడిని మాత్రమే సూచిస్తుంది. అంతేగాక అరబీ భాష మాట్లాడే క్రైస్తవులు మరియు యూదులు కూడా దేవుడిని సూచించేందుకు అల్లాహ్ అనే పదాన్నే వాడతారు.

    ముస్లింలు, యూదులు మరియు క్రైస్తవులు ఒకే దైవాన్ని (సర్వలోక సృష్టికర్తను) మాత్రమే విశ్వసిస్తున్నా, వారి దైవభావనలో చాలా తేడా ఉన్నది. ఉదాహరణకు, దేవుడికి సాటి కల్పించడం లేదా త్రైత్వంలో ఒకడని భావించడం వంటి భావనలను ముస్లింలు పూర్తిగా తిరస్కరిస్తారు మరియు పరిపూర్ణత్వం కేవలం సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ కు మాత్రమే చెందుతుందని అంటారు.

    3వ అపార్థం – “ఇస్లాం ధర్మం తీవ్రవాదాన్ని అనుమతిస్తుంది”

    సాధారణంగా ఏ ముస్లిం పోరాడుతున్నా, మీడియా అతడిని తీవ్రవాదిగానే చూపుతుంది – అతడు న్యాయం కోసం పోరాడుతున్నా లేక న్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా, ఇతరులను అణిచి వేస్తున్నా లేక ఇతరుల అణిచివేతకు గురవుతున్నా.

    యుద్ధరంగంలో, పోరాటంలో పాల్గొనని అమాయకులను లక్ష్యం చేయడాన్ని ఇస్లాం ధర్మం స్పష్టంగా నిషేధిస్తున్నది. నిజానికి, అమాయక ప్రజలకు హాని కలిగించకూడదనే ఆదేశంతో పాటు చెట్లను మరియు జంతువులను అనవసరంగా నాశనం చేయకూడదనే నిషేధం కూడా ముస్లింలపై ఉన్నది. ఏదేమైనా, తీవ్రవాదానికి మరియు దురాక్రమణల వ్యతిరేకతకు మధ్య ఉన్న భేదాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి రెండూ పూర్తిగా వ్యతిరేకమైన భిన్నధృవాలు.

    అమాయక వ్యక్తిని హత్య చేయడం ఎంత తీవ్రమైన విషయమో ఖుర్ఆన్ గ్రంథం స్పష్టంగా తెలుపుతున్నది మరియు మానవజీవిత విలువను నొక్కి వక్కాణిస్తున్నది.

    “ఒకవేళ ఎవరైనా ఒక అమాయక వ్యక్తిని హత్య చేస్తే, అతడు మొత్తం మానవజాతిని హత్య చేసినట్లుగా పరిగణింపబడతాడు. ఆలాగే ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తిని కాపాడితే, అతడు మొత్తం మానవజాతిని కాపాడినట్లుగా పరిగణింపబడతాడు.” ఖుర్ఆన్ 5:32

    4వ అపార్థం – “ఇస్లాం ధర్మం స్త్రీలను అణిచివేస్తున్నది”

    ఇస్లాంలో, దైవం ముందు స్త్రీపురుషులు ఇరువురూ సమానులే. వారుభయులూ సరిసమానంగానే పుణ్యాలు పొందుతారు మరియు తమ తమ పనులకు వూరుభయులూ సరిసమానంగా బాధ్యులు. అల్లాహ్ పై చూపే భయభక్తుల స్థాయిని బట్టి మాత్రమే అల్లాహ్ వద్ద ప్రజల స్థానం నిర్ణయించబడుతుంది. (ఎవరు ఎక్కువ అల్లాహ్ యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వారు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానం పొందుతారు.)

    “ఎవరైతే అత్యంత ఎక్కువగా అల్లాహ్ యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వారే అల్లాహ్ దృష్టిలో మహోన్నతులు.” ఖుర్ఆన్ 49:13

    అసలైన గౌరవం మరియు స్టేటస్ అనేది ఒక వ్యక్తి ధనికుడు లేదా బీదవాడు, నల్లవాడు లేదా తెల్లవాడు, మగవాడు లేదా స్త్రీ అనే వాటి ద్వారా పొందలేము, కానీ దానిని కేవలం అల్లాహ్ యొక్క భయభక్తులు మరియు మనస్పూర్తిగా సమర్పించుకోవడం ద్వారా మాత్రమే పొందగలమనే విషయం ఈ ఖుర్ఆన్ వచనం నిరూపిస్తున్నది.

    ఉభయ లింగాలను సృష్టించిన అల్లాహ్, వారుభయులకూ వారి మధ్య ఉన్న తేడాలను పరిగణలోనికి తీసుకుని వేర్వేరు పాత్రలు, కర్తవ్యాలు మరియు బాధ్యతలు నిర్దేశించినాడు. స్త్రీలకు అత్యంత ఎక్కువ గౌరవం మరియు స్టేటస్ ఇవ్వబడెను. ఉదాహరణకు సరిసమానంగా వేతనం చెల్లించడం, జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, విద్యాభ్యాసం, భర్తకు విడాకులు ఇచ్చే హక్కు, ఆస్తిపాస్తుల వారసత్వ హక్కు మొదలైనవి.

    దురదృష్టవశాత్తు వారి వారి హక్కులను ఇవ్వకుండా మహిళలను అణచి వేస్తున్న కొందరు ముస్లింలు కూడా ఉన్నారు. ఇది ఇస్లాం తప్పు కాదు. అసలు సమస్య ఏమిటంటే, వివిధ దేశాలలో కొందరు ముస్లింలు ఇస్లాం ధర్మంతో ఎలాంటి సంబంధం లేని కొన్ని ప్రాంతీయ సంప్రదాయాలను మరియు ఆచారాలను అనుసరిస్తూ ఉంటారు.

    5వ అపార్థం – “ఖుర్ఆన్ కూడా మరో చారిత్రక లేక కవితల గ్రంథం”

    ఖుర్ఆన్ గ్రంథం సర్వలోకాల సృష్టికర్త, ప్రభువు అయిన అల్లాహ్ యొక్క దివ్యమైన వాక్కు. ఆయన దానిని తన అంతిమ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై జిబ్రయీల్ దైవదూత ద్వారా అవతరింపజేసినాడు. ఇది సత్యాసత్యాలను వేరు చేసే గీటురాయి. ఇందులో మొత్తం మానవజాతి కొరకు చక్కటి మార్గదర్శకత్వం ఉన్నది. ఖుర్ఆన్ గ్రంథం పూర్వ తరాల నుండి మరియు ప్రవక్తల చరిత్ర నుండి అనేక గుణపాఠాలను ప్రస్తావిస్తున్నది. వాటి నుండి మనం కూడా గుణపాఠం నేర్చుకుంటామని. ఇంకా స్వయంగా మన గురించి, మన సృష్టికర్త గురించి, మన జీవిత పరమార్థం అంటే సృష్టికర్తను గుర్తించడం మరియు కేవలం ఆయనను మాత్రమే ఆరాధించడం గురించి చక్కగా బోదిస్తున్నది.

    ఎలాంటి లక్ష్యం లేకుండా పిచ్చి పిచ్చిగా అటూ ఇటూ తిరగటానికి కాదు ఆయన మానవులను సృష్టించింది. తమకు ప్రసాదించబడిన తెలివితేటలు, వివేకం, విచక్షణ, స్వేచ్ఛ, హేతువాద సామర్ధ్యం మొదలైన వాటిని సరిగ్గా ఉపయోగించి, సర్వలోక సృష్టికర్త చిహ్నాలు, సూచనల గురించి పరిశోధించి, వాటిని గుర్తించడం అనేది మన దైవ విశ్వాసం యొక్క అసలు పరీక్ష. అన్నింటి కంటే మహాద్భుత సూచన “ఖుర్ఆన్ గ్రంథం”.

    స్వయంగా ఖుర్ఆన్ గ్రంథం తనలో అనేక అద్భుతాలను కలిగి ఉన్నది. వాటిపై దృష్టి సారించడం వలన దాని ప్రామాణికతపై మనకు సందేహం కలిగే అవకాశమే లేదు. అసలు ఖుర్ఆన్ దేని గురించి బోధిస్తున్నది అనే విషయాన్ని తెలుసుకునే అతి గొప్ప మార్గం ఏమిటంటే స్వయంగా మీరే దానిని చదవడం.

    6వ అపార్థం – “హిజాబ్ అణచివేతకు చిహ్నం”

    హిజాబ్ పరదా వేసుకోవడమంటే, ముస్లిం మహిళలు చక్కటి, సాంప్రదాయకమైన వదులు దుస్తులు ధరించి తమ శరీర భాగాలను, శరీర ఆకారాన్ని పరపురుషుల కంటికి కనబడకుండా దాచుకోవడం. అయితే హిజాబ్ అంటే కేవలం బహిరంగ వస్త్రధారణ మాత్రమే కాదు, దానిలో మర్యాదపూర్వకమైన సంభాషణ, మానమర్యాదలు మరియు సంస్కారంతో నిండిన నైతిక ప్రవర్తన మొదలైనవన్నీ ఇమిడి ఉన్నాయి.

    హిజాబ్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ముస్లిం మహిళలను హిజాబ్ దుస్తులు ధరించడానికి అసలు కారణం అది అల్లాహ్ యొక్క ఆజ్ఞ అవడమే. తన సృష్టికి ఏది మంచిదో ఆయన బాగా ఎరుగును.

    ఒక స్త్రీ తన బహిరంగ ప్రదర్శనపై కాకుండా, అంతరంగిక సౌందర్యంపై దృష్టి కేంద్రీకరించేలా హిజాబ్ వ్యవస్థ మార్గదర్శకత్వం వహిస్తున్నది. హిజాబ్ వ్యవస్థ మహిళలకు తమ పాతివ్రత్యాన్ని కాపాడుకుంటూ, సామాజిక అభివృద్ధిలో యాక్టివ్ గా పాల్గొనే అవకాశాన్ని ఇస్తున్నది.

    హిజాబ్ వ్యవస్థ అణచివేత, దౌర్జన్యం లేదా నోరు మూయడం వంటి వాటిని సూచించదు. అయితే అది వారి స్థాయిని దిగజార్చకుండా కాపాడే రక్షణ కవచం. అనవసరమైన మరియు అనైతిక అడుగులకు అది ఆటంకమవుతుంది. కాబట్టి, ఇక నుండి మీరెప్పుడైనా ముస్లిం మహిళను చూస్తే, ఆమె తన బాహ్య శరీరాన్ని కప్పి వేసుకుందే గానీ తన బుద్ధిని లేక తెలివితేటలను కాదని తెలుసుకోండి.

    7వ అపార్థం – “ముస్లిములందరూ అరబ్బులే”

    ప్రపంచంలోని ముస్లింలలో కేవలం 20% ప్రజలు మాత్రమే అరబ్బులు. అంటే 80% ముస్లింలు అరబ్బేతరులన్నమాట. ఉదాహరణకు, అరబ్బు ముస్లింల సంఖ్య కంటే భారతదేశం మరియు ఇండోనేషియా దేశాలలోని ముస్లింల సంఖ్య ఎక్కువ.


    రంగు, జాతి, వర్గం, కులం, సంపద, అధికారం, స్టేటస్ మొదలైన వాటి కారణంగా ఏ వ్యక్తీ మరో వ్యక్తి కంటే గొప్ప వాడు కాజాలడని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. ఇస్లాం ధర్మం జాతి వివక్షతను తీవ్రంగా ఖండిస్తున్నది. ఇస్లాం సందేశం మొత్తం మానవులందరి కోసం పంపబడిన ఒక సార్వత్రిక సందేశం. ఏకైక దైవమైన సర్వలోక సృష్టికర్తను గుర్తించడం మరియు ఆరాధించడం ద్వారా ప్రతి ఒక్కరూ శాంతి మరియు సాఫల్యం పొందగలరు.

    8వ అపార్థం – “జిహాద్ అంటే ఉగ్రవాదం, తీవ్రవాదం”

    జిహాద్ అంటే శ్రమించడం, ప్రయాస పడటం. దైవం మెచ్చుకునే విధంగా తమ ధర్మం కోసం త్యాగం చేయడం. భాషాపరంగా, దీని అర్థం శ్రమించడం, కష్టపడటం. ఇది మంచి పనులు మరియు దానధర్మాలు చేయడంలో శ్రమించడం లేదా ఇస్లామీయ సైనిక చర్యలలో పాల్గొనడం మొదలైన వాటిని సూచిస్తుంది. అయితే మిలటరీ జిహాద్ అనేది అత్యంత ప్రచారంలో ఉన్న అవగాహన. సమాజ సంరక్షణ కోసం, దౌర్జన్యం మరియు అణచివేత వ్యాపించకుండా కట్టడి చేయడం కోసం, న్యాయ స్థాపన కోసం మాత్రమే మిలటరీ జిహాద్ అనుమతించబడింది. అది పరిస్థితులను బట్టి ఎదురు దాడి కావచ్చు లేదా డిఫెన్సు కావచ్చు.

    9వ అపార్థం – “ముస్లింలు ముహమ్మద్ ను లేక చంద్ర దేవుడిని పూజిస్తారు”

    ముస్లింలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పూజిస్తారనేది మరో ఘోరమైన అపార్థం. దీనిలో అస్సలు సత్యం లేదు. ఇది పచ్చి అబద్ధం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ బోధనను పరిశీలించడం ద్వారా దీనిలోని నిజానిజాలు సులభంగా గుర్తించవచ్చు:“మర్యమ్ కుమారుడైన జీసస్ ను క్రైస్తవులు హద్దుమీరి ప్రశంసించినట్లుగా మీరు నన్ను ప్రశంసించవద్దు. నేను కేవలం దైవదాసుడిని మాత్రమే. కాబట్టి నన్ను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన దాసుడు అని పేర్కొనండి.’ “

    అల్లాహ్ యొక్క ప్రవక్తలందరినీ మరియు సందేశహరులందరినీ గౌరవించాలని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. వారిని గౌరవించడం, ప్రేమించడమంటే వారిని ఆరాధించాలని, పూజించాలని ఎంత మాత్రమూ కాదు.

    అలాంటిదే మరో అభాండము – ముస్లింలు చంద్ర దేవుడిని పూజిస్తారు. ఇది ఎంత మాత్రమూ నిజం కాదు. అల్లాహ్ ను వదిలి చంద్రుడిని లేదా ఇతరులను ఆరాధించడమనేది ఇస్లాం ధర్మంలో తీవ్రంగా, తీక్షణంగా నిషేధించబడింది:

    “సూర్యచంద్రులకు సాష్టాంగ పడవద్దు, కానీ మిమ్ముల్ని సృష్టించిన అల్లాహ్ కు మాత్రమే సాష్టాంగపడండి – ఒకవేళ మీరు నిజంగా ఆయనను ఆరాధిస్తున్నట్లయితే.” ఖుర్ఆన్ 41:37

    సర్వలోక సృష్టికర్త యొక్క పరిపూర్ణత్వం, ఘనత, సార్వభౌమత్వం, ఏకత్వం మొదలైన వాటిని ఇస్లాం ధర్మం సర్దుబాట్లకు అస్సలు తావులేకుండా ప్రాధాన్యతనిస్తున్నది. ఆయన అత్యంత న్యాయవంతుడు, అత్యంత కరుణామయుడు. కేవలం ఆయనను మాత్రమే ఆరాధించడమనేది ఇస్లాం ధర్మంలో అత్యంత ముఖ్యమైన విశ్వాసం. దీని గురించి ఖుర్ఆన్ లో అనేక చోట్ల ప్రస్తావించబడింది.

    10వ అపార్థం – “బలవంతపు పెళ్ళళ్ళను ఇస్లాం ధర్మం అనుమతిస్తున్నది”

    ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలలో పెద్దలు కుదిర్చే పెళ్ళిళ్ళు సాంస్కృతిక ఆచారంగా అనుసరించబడుతున్నాయి. ముస్లింలపై ముస్లింల విషయంలో ఎలాంటి నిబంధనలు లేనప్పటికీ, తప్పుగా బలవంతపు పెళ్ళిళ్ళు ఇస్లాంతో ముడిపెట్టబడినాయి.

    ఇస్లాంలో, స్త్రీపురుషులు ఉభయులూ తమకు ఇష్టమైన జీవిత భాగస్వామిని ఎంచుకునే లేదా తిరస్కరించే హక్కు కలిగి ఉన్నారు. అంతేగాక ఇస్లాం ధర్మంలో పెళ్ళికి ముందు పెళ్ళికూతురి ప్రామాణికమైన అంగీకారం తీసుకోకపోతే ఆ పెళ్ళి అస్సలు చెల్లదు.

    11వ అపార్థం – “ప్రజలు ముస్లింలుగా మారాలని ఇస్లాం ధర్మం బలవంతం చేస్తుంది”

    అల్లాహ్ ఆజ్ఞ, “ధర్మంలో నిర్బంధం లేదు. అసత్యం నుండి సత్యం స్పష్టం చేయబడింది.” ఖుర్ఆన్ 2:256

    ఆకర్షణీయమైన ఇస్లాం ధర్మ సందేశాన్ని ఇతరులకు అందజేయడమనేది ముస్లింల బాధ్యత, కర్తవ్యమై ఉంది. అయినా, ఇస్లాం ధర్మం స్వీకరించాలని ఎవ్వరినీ బలవంతం చేయకూడదని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. ఎవరైనా ఇస్లాం ధర్మం స్వీకరించాలంటే, అతను చిత్తశుద్ధితో మరియు మనస్ఫూర్తిగా అల్లాహ్ పై విశ్వాసం తీసుకురావాలి మరియు అల్లాహ్ యొక్క విధేయులుగా మారాలి. కాబట్టి, ఈ నిర్వచనం ప్రకారం, ఇస్లాం ధర్మంలోనికి ప్రవేశించమని ఎవ్వరినీ బలవంతం చేయకూడదు.

    క్రింది విషయాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి:

    · ఇండోనేషియా దేశం ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగి ఉన్నది. అయినా అక్కడ ఎన్నడూ ఇస్లామీయ సైన్యం కాలుమోపలేదు.

    · తరతరాలుగా అరేబియా గుండెకాయలో దాదాపు 14 మిలియన్ల అరబ్ కాప్టిక్ క్రైస్తవులు సురక్షితంగా జీవిస్తున్నారు.

    · ఈనాడు పాశ్చాత్య దేశాలలో ఇస్లాం ధర్మం అన్ని ధర్మాల కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది.

    · అణచివేతను, దౌర్జన్యాన్ని వ్యతిరేకించేందుకు మరియు న్యాయాన్ని స్థాపించేందుకు జిహాద్ ధర్మయుద్ధం అనుమతించబడినా, ప్రజలను ఇస్లాం ధర్మం స్వీకరించమని బలవంతం పెట్టేలా జిహాద్ యుద్ధం చేసేందుకు అనుమతి లేదు.

    · దాదాపు 800 సంత్సరాల పాటు స్పెయిన్ దేశాన్ని ముస్లింలు పరిపాలించారు. అయినా అక్కడ ఎన్నడూ ప్రజలను ఇస్లాం ధర్మం స్వీకరించమని బలవంతపెట్టలేదు.

    ముగింపు

    తప్పొప్పుల గురించి సరిగ్గా పరిశోధించకుండా, అప్రామాణికమైన చోట్ల నుండి ఇస్లాం ధర్మం గురించి నేర్చుకోవడం చాలా ప్రమాదకరమైన విషయం. అది అనేక అపార్థాలకు దారి తీస్తుంది. కాబట్టి ఇస్లాం గురించి తప్పుగా ప్రచారం చేసే అలాంటి అపార్థాలను నమ్మి, మార్గభ్రష్టులు కాకండి – మొత్తం మానవజాతిలో దాదాపు నాలుగోవంతు కంటే ఎక్కువ ప్రజలు దృఢంగా విశ్వసిస్తున్న గొప్ప ధర్మం ఇస్లాం ధర్మం.

    ఇస్లామీయ సందేశ మొత్తం మానవజాతి కొరకు మార్గదర్శిని కాదా ? అది జాగ్రత్తగా పరిశీలించవలసిన, దీర్ఘాలోచన చేయవలసిన హక్కు కలిగి లేదా?

    معلومات المادة باللغة العربية