×
جدبد!

تطبيق موسوعة بيان الإسلام

احصل عليه الآن!

مقدمة عن الإسلام (تلقو)

الوصف

مقالة مترجمة إلى لغة التلغو تحتوي على مقدمة مختصرة عن الإسلام من خلال لمحة سريعة لأركان الإسلام الخمسة وأركان الإيمان الستة بجانب بيان مفهوم العبادة في الإسلام، كل ذلك بطريقة سهلة يسيرة.

تنزيل الكتاب

    ఇస్లాం గురించి .....

    ఇస్లాం ధర్మం ప్రకృతి సహజ ధర్మం మరియు ఒక సంపూర్ణ జీవన విధానం. ఇది తమ సృష్టికర్తతో కలిగి ఉండవలసిన గట్టి సంబంధంపై సావధానత చూపాలని ప్రోత్సహిస్తున్నది. సర్వలోక సృష్టికర్త మార్గదర్శకత్వాన్ని అనుసరించి మంచి పనులు చేస్తూ, ఆయనకు చేరువ కావడం ద్వారా నిజమైన శాశ్వత సుఖసంతోషాలు మరియు శాంతి లభిస్తాయని ప్రజలకు బోధిస్తున్నది.

    ప్రపంచ జనాభాలో ముస్లింలు దాదాపు ఐదవ వంతు ఉండి, ప్రపంచంలోని అతి పెద్ద ధర్మాలలో ఒకటిగా ఇస్లాం ధర్మానికి స్థానం కల్పించారు. సర్వలోక సృష్టికర్త అయిన ఏకైక ఆరాధ్యుడిని విశ్వసించడం మరియు ఆరాధించడమే మానవ జీవిత ఉద్దేశ్యం మరియు ఇస్లాం ధర్మం యొక్క మూలస్థంభము.

    “ఇస్లాం” అనే అరబీ పదం యొక్క భాషాపరమైన అర్థం “సమర్పణ, శాంతి” అంటే సర్వలోక సృష్టికర్త అయిన ఏకైక ఆరాధ్యుడికి మనస్ఫూర్తిగా, శాంతియుతంగా సమర్పించుకొనుట. అలాగే ముస్లిం అంటే జాతి, కుల, వర్గ, వర్ణ, లింగ, హోదా, ఆస్తీఅంతస్తుల భేదం లేకుండా స్వచ్ఛందంగా సర్వలోక సృష్టికర్త అయిన ఏకైక ఆరాధ్యుడికి సమర్పించుకున్నవారు.

    ఇస్లాం ధర్మం యొక్క ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇతర ధర్మాల వలే ఇస్లాం ధర్మం యొక్క పేరు ఎవరో ఒక వ్యక్తిని లేదా జాతిని అనుసరించి పెట్టబడలేదు.

    అర్కాన్ అల్ ఈమాన్ అంటే దైవవిశ్వాసం యొక్క ఆరు మూలస్థంభాలు

    1. అల్లాహ్ పై విశ్వాసం

    “అల్లాహ్” అనేది అద్భుత అరబీ భాషలో సర్వలోక సృష్టికర్త అయిన ఏకైక ఆరాధ్యుడి స్వంత పేరు. అల్లాహ్ కు విరోధులు లేరు, భాగస్వాములు లేరు, సమానులు లేరు, సంతానంలేదు, తల్లిదండ్రులు లేరు. ఆయనకు మరియు ఆయన సృష్టికి అస్సలు పోలిక లేదు. ఎందుకంటే ఆయన దివ్యత్వంలో మరియు పరిపూర్ణ దివ్యలక్షణాలలో ఎవ్వరికీ భాగస్వామ్యం లేదు. ఆయన యొక్క కొన్ని దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు: సర్వలోక సృష్టికర్త, అత్యంత దయామయుడు, అపార కృపాశీలుడు, మహోన్నతుడు, అత్యంత శక్తిమంతుడు, అత్యంత న్యాయవంతుడు, అత్యంత వివేకవంతుడు, పాలకుడు, పోషకుడు, అన్నీ ఎరిగినవాడు.

    ఆయనే అన్నింటి సృష్టికర్తా మరియు పోషకుడూను. మనకు లెక్కకు మించిన అనుగ్రహాలను ప్రసాదించినాడు. ఉదాహరణకు, వినే, చూచే, ఆలోచించే, నడిచే, మాట్లాడే మరియు సంతానోత్పత్తి చేసే శక్తిసామర్ధ్యాలు. అందువలన మనం ఆయన మహోన్నత స్థానాన్ని గుర్తించాలి, ఒప్పుకోవాలి, కృతజ్ఞతలు తెలుపుకోవాలి మరియు ఆయన పంపిన మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తూ, కేవలం ఆయనను మాత్రమే ఆరాధించాలి.

    అత్యంత శక్తిమంతుడు మరియు వివేకవంతుడి ద్వారా కాకుండా, అత్యంత క్లిష్టతరమైన ఈ సంతులిత విశాల విశ్వం ఉనికిలోనికి రావడం అసంభవమనే మాట హేతుబద్ధమైనది. కాబట్టి ఈ సృష్టి తనకు తానుకు ఉనికి లోనికి వచ్చింది లేదా ఏదో హఠాత్పరిణామం లేక యాధృచ్ఛిక సంఘటన వలన ఉనికి లోనికి వచ్చిందని భావించడం ఎంత మాత్రమూ హేతుబద్ధమైన విషయం కాదు.

    2. దైవదూతలపై విశ్వాసం

    దైవదూతలు కాంతితో సృష్టించబడినారు. వారికి కొన్ని బాధ్యతలు అప్పజెప్పబడినాయి. దైవదూతలు ఎన్నడూ సర్వలోక సృష్టికర్తకు అవిధేయత చూపవు. వారిలో కొందరి గురించి మాత్రమే దివ్యసందేశం ద్వారా తెలియజేయబడింది – ఉదాహరణకు, దైవప్రవక్తలకు దివ్యసందేశాన్ని అందజేసే జిబ్రయీల్, ప్రజల ప్రాణం తీసే మరణ దైవదూత.

    3. దైవగ్రంథాలపై విశ్వాసం

    మానవాళికి మార్గదర్శకత్వం వహించేలా, మానవులపై కారుణ్యంగా అల్లాహ్ తన ప్రవక్తలపై దివ్యవాణిని అవతరింపజేసినాడు. ఆ దివ్యవాణులలో తౌరా, గోస్పెల్ దివ్యగ్రంథాలు మోసెస్ మరియు జీసస్ అలైహిస్సలాంలపై అవతరింపజేయబడినాయి. అలాగే ఖుర్ఆన్ దివ్యగ్రంథం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడింది.

    ఖుర్ఆన్ అల్లాహ్ వాక్కు మరియు సమస్త మానవుల కొరకు పంపబడిన అంతిమ సందేశం. అది సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ నుండే అవతరింపజేయబడిందని నిరూపించే అనేక స్పష్టమైన నిదర్శనాలు మరియు మహిమలు ఉన్నాయి. ఉదాహరణకు వాటిలో కొన్ని:

    · మన అంతరాత్మలోని దైవవిశ్వాసాన్ని మేలుకొలిపే సులభమైన, స్వచ్ఛమైన సార్వజనిక సందేశాన్ని కలిగున్నది.

    · సాహిత్యపరంగా సాటిలేని ప్రత్యేక శైలి కలిగి ఉన్నది. అది అరబీ భాషలో అత్యుత్తమ వాగ్ధాటి మరియు సాహిత్య సౌందర్యాన్ని కలిగి ఉన్న సాటిలేని గ్రంథమనే వాస్తవం విశ్వవ్యాప్తంగా గుర్తించబడింది – అయినా అది నిరక్షరాస్యులైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడిందనే వాస్తవం ఒక చారిత్రక నిదర్శనం.

    · 1400 సంవత్సరాలకు పూర్వమే అవతరింపజేయబడిన అందులోని అనేక వైజ్ఞానిక వాస్తవాలను, ఈ మధ్యకాలంలోనే శాస్త్రజ్ఞులు నేటి ఆధునిక సాంకేతిక పరికరాల సహాయంతో కనిపెట్టగలిగారు.

    · దానిలో ఎలాంటి పొరపాట్లు లేదా పరస్పర విరుద్ధమైన వచనాలు లేవు.

    · కాలక్రమంలో అనేక మార్పులు చేర్పులకు గురైన, అసలు వచనాలను కోల్పోయిన ఇతర దివ్యగ్రంథాలకు వలే కాకుండా, దానిలోని ప్రతి అక్షరం అరబీ భాషలో అవతరించినప్పటి నుండి ఎలాంటి మార్పులు చేర్పులకు గురి కాకుండా స్వచ్ఛమైన అసలు రూపంలోనే సజీవంగా ఉండేట్లు భద్రపరచబడింది.

    అనేక అద్భుతమైన మరియు మహిమలతో నిండిన ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత గురించి అత్యంత హేతువాద వివరణ ఏమిటంటే అది కేవలం సర్వలోక సృష్టికర్త నుండి మాత్రమే పంపబడింది. ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రామాణిక పలుకులు మరియు ఆచరణలు ఇస్లామీయ ధర్మజ్ఞానం యొక్క ప్రాథమిక మూలాలుగా గుర్తించబడినాయి.

    4. దైవప్రవక్తలపై విశ్వాసం

    అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రజలకు అందజేసేందుకు ప్రతి జాతి కొరకు కనీసం ఒక ప్రవక్త చొప్పున అనేక వేల మంది ప్రవక్తలు పంపబడినారని ముస్లింల విశ్వాసం. ఈ ప్రవక్తలలో కొందరి పేర్లు ఆదం, నూహ్, అబ్రహాం, డేవిడ్, జోసెఫ్, మోసెస్, జీసస్ అలైహిస్సలాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రజలను ఏకైక నిజ దైవమైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించమని పిలవబడమే వారి లక్ష్యం. అంతేగాక వారు ఆచరాణ్మకంగా ఎలా అల్లాహ్ కు విధేయత చూపాలి అనే ఆచరించి చూపారు. ప్రజలకు ముక్తిమార్గం వైపు దారి చూపారు. సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ యొక్క దైవత్వంలో వారు భాగస్వామ్యాన్ని పంచుకోలేదు. తమనే ప్రార్థించడాన్ని మరియు ఆరాధించడాన్ని లేదా తమ ద్వారానే ప్రభువును ప్రార్థించడాన్ని లేదా ఆరాధించడాన్ని వారు పూర్తిగా నిషేధించారు. అలా చేయడాన్ని వారు కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధింపబడాలనే ఆయన హక్కును ఉల్లంఘించినట్లవుతుందని బోధించారు.

    - ప్రవక్త జీసస్ అలైహిస్సలాం

    అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా తన తల్లి కన్య మేరీకు అద్భుతంగా జన్మించిన ప్రవక్త జీసస్ అలైహిస్సలాంను ముస్లింలు అల్లాహ్ యొక్క ఒక గౌరవనీయ ప్రవక్తగా విశ్వసిస్తారు. అల్లాహ్ యొక్క అనుజ్ఞతో ఆయన అనేక మహిమలు చేసి చూపారు, ఉదాహరణకు రోగులను నయం చేయడం, అంధులకు చూపును ప్రసాదించడం మరియు ఉయ్యాలలోని దినాల పసిబిడ్డగా ప్రజలు తన తల్లిపై వేస్తున్న నిందలకు జవాబివ్వడం. ముస్లింలు ప్రవక్త జీసస్ అలైహిస్సలాంను గౌరవిస్తున్నా మరియు ప్రేమిస్తున్నా, ఆయనను మాత్రం పూజించరు, ఆరాధించరు. ఆయనను దేవుడి కుమారుడిగా లేదా త్రైత్వంలో ఒకనిగా లేదా దేవుడి సంపూర్ణ దివ్యలక్షణాలలో భాగస్వామిగా పరిగణించరు. ఖుర్ఆన్ లోని అల్లాహ్ యొక్క ప్రకటన ఇలా ఉన్నది:

    “ఎవరినైనా కుమారునిగా చేసుకోవడం అల్లాహ్ స్థాయికి తగిన పని కాదు; ఆయన సర్వలోపాలకు అతీతుడు! ఆయన ఏదైనా చేయదల్చుకుంటే, దానిని కేవలం ‘అయిపో’ అని అంటాడు, అంతే అది అయిపోతుంది.” ఖుర్ఆన్ 19:35

    - ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం

    ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళి కోసం పంపబడిన అంతిమ ప్రవక్త. ఆయనపై అంతిమ దివ్యసందేశం ఖుర్ఆన్ అవతరించింది. మన జీవితంలో దానిని ఎలా అనుసరించాలో స్వయంగా ఆచరించి చూపారు. నిజాయితీ, న్యాయం, దయ, కారుణ్యం, సత్యత మరియు ధైర్యసాహసాలకు ఆయన ఒక సంపూర్ణ ఉపమానం. ప్రవక్త జీసస్ అలైహిస్సలాంకు వలే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూడా ముస్లింలు ఆరాధించరు, ప్రార్థించరు, అల్లాహ్ యొక్క దైవత్వంలో భాగస్వామిగా పరిగణించరు.

    5. అంతిమ తీర్పుదినంపై విశ్వాసం

    అంతిమ తీర్పదినం తప్పనిసరిగా సంభవించబోతున్నది. ఆ మహాదినమున మనలోని ప్రతి ఒక్కరు మన సృష్టికర్త అయిన అల్లాహ్ ముందు నిలబెట్టబడతాము మరియు ఇహలోకపు మంచి చెడు పనుల గురించి ప్రశ్నింపబడతాము. ఎంత చిన్నదైనా, పెద్దదైనా సరే దాని పరిమాణంతో నిమిత్తం లేకుండా మన ప్రతి పనీ లెక్కించబడుతుంది.

    ఈ మహత్వపూర్ణ దినమున, అత్యంత న్యాయవంతుడైన అల్లాహ్ ప్రతి విషయంపై న్యాయంగా తీర్పునిస్తాడు. ఎవ్వరికీ అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరి హక్కులు వాపసు చేయబడతాయి. ఇహలోకంలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా శాశ్వత స్వర్గప్రవేశం లేదా నరకప్రవేశం తీర్మానించబడుతుంది. తద్వారా మానవులందరికీ న్యాయం జరుగుతుంది.

    6. విధివ్రాతపై విశ్వాసం

    భూత భవిష్య వర్తమాన కాలాలలో ఏమి జరుగునో అల్లాహ్ కు బాగా తెలుసు. ఆయనకు అన్నింటిపై పూర్తి ఆధిపత్యం ఉన్నది – ఆయనకు తెలియకుండా మరియు ఆయన అనుజ్ఞ, అనుమతి లేకుండా ఏదీ జరగదు.

    మంచి చెడులలో ఒకదానిని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఇవ్వబడటం వలన తాము ఎంచుకున్న దారికి తామే బాధ్యత వహించ వలసి ఉన్నది.

    అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు అనుమతితో మాత్రమే ఏదైనా జరుగుతుందనే వాస్తవంతో మనకు ప్రసాదించబడిన స్వేచ్ఛ విభేదించదు. ప్రతిదానిపై అల్లాహ్ కు ఉన్న ఆధిపత్యం ప్రజల స్వేచ్ఛను అడ్డుకుంటుందని లేక పరిమితం చేస్తుందనీ కాదు. ప్రజలు తీసుకునే నిర్ణయాల గురించి ముందుగానే అల్లాహ్ కు తెలిసి ఉండటం అనేది వారలా నిర్ణయించుకునేలా బలవంతం చేయబడతారనీ కాదు. తన అనుమతితోనే జరుగుతున్న సంఘటనలలో ప్రతిదానికీ సృష్టికర్త సంతుష్టంగా ఉన్నాడనీ కాదు.

    ఇస్లామీయ ఆరాధనల ఐదు మూలస్థంభాలు

    ఒక ముస్లిం జీవిత పునాది.

    1. విశ్వాస సాక్ష్యప్రకటన

    విశ్వాస సాక్ష్యప్రకటన – అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్ హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన మరో ఆరాధ్యుడు లేడని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్, అల్లాహ్ యొక్క ప్రవక్త అనీ.

    దీనిని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధి మరియు దృఢవిశ్వాసంతో పలికి, ఆచరణలతో ధృవీకరించాలి. ఈ విశ్వాస సాక్ష్యప్రకటన ద్వారా ఇతర ఆరాధ్యులు, దేవుళ్ళందరినీ ఆ వ్యక్తి పూర్తిగా తిరస్కరిస్తాడు. అంతేగాక కేవలం అల్లాహ్ మాత్రమే ఆరాధింపబడే అర్హతలు, యోగ్యతలు గలవాడని నొక్కి చెబుతూ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అంతిమ ప్రవక్తగా స్వీకరించి, ముస్లింగా మారిపోతాడు.

    2. రోజువారీ ఐదు పూటల నమాజులు

    ఒక ముస్లింకు మరియు వాని సృష్టికర్తకు మధ్య వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక పవిత్ర సంబంధాన్ని నమాజులు స్థాపిస్తాయి. సృష్టికర్తకు విధేయత చూపాలనే బాధ్యతను నిలకడగా మరియు ఆచరణాత్మకంగా జ్ఞాపకం చేసే ఒక రిమైండర్. ఐదు పూటలా నమాజు చేయవలసిన నిర్ణీత సమయాలు – ఉషోదయం, మధ్యాహ్నం, సాయంత్రం, సూర్యాస్తమయం అయిన వెంటనే మరియు రాత్రి పూట. ప్రతి నమాజు పూర్తి చేయడానికి కొన్ని నిమిషాల సమయమే పడుతుంది. అందులో నిలుచొవటం, వంగొటం, కూర్చొటం, సాష్టాంగపడటం వంటి వివిధ భంగిమలలో ఖుర్ఆన్ పఠించడం, వేడుకోవడం, అల్లాహ్ ను ప్రశంసించడం మొదలైనవి ఉన్నాయి. నమాజు చేసే ముందు శారీరక మరియు ఆధ్యత్మిక పవిత్రత కోసం ముస్లింలు శుభ్రంగా తమ నోరు, ముక్కు, ముఖం, చెవులు, చేతులు, పాదాలు మొదలైన అవయవాలను నీళ్ళతో కడుగుతారు.

    3. జకాతు – వార్షిక విధిదానం

    నిర్ణీత పరిమితికి మించి అదనపు సంపద ఒక సంవత్సరం పాటు నిలువ చేసుకున్న ముస్లింలపై వార్షిక విధిదానం తప్పనిసరి. అలాంటి వారిపై ప్రతి సంవత్సరం తమ సంపదలో నుండి 2.5% తీసి, అర్హులైన బీదలకు, అక్కరగలవారికి లేదా అప్పులలో కూరుకుపోయిన ప్రజలకు దానం చేయాలి. అది వారి సంపదను పవిత్రం చేస్తుంది. దీని వలన ఇచ్చేవానికి మరియు పుచ్చుకునేవానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఏమిటంటే ధనవంతుల మరియు పేదల మధ్య దూరాన్ని తగ్గించి, ఆత్మీయతను పెంచుతుంది. అంతేగాక ప్రతి ఒక్కరి కనీస అవసరాలు పూర్తయ్యేలా చేస్తుంది.

    4. రమదాన్ మాస ఉపవాసాలు

    ప్రతి సంవత్సరం రమదాన్ మాసంలో ముస్లింలు ప్రాతఃకాలం నుండి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాల నుండి మరియు దాంపత్య సుఖం నుండి దూరంగా ఉండి అల్లాహ్ ఆజ్ఞను అనుసరిస్తూ ఉపవాసం పాటిస్తారు. అది మనల్ని ఆధ్యాత్మికంగా పరిశుద్ధ పరుస్తుంది. మనలో సహనం, ఓర్పులను మరియు స్వనిగ్రహాన్ని పెంచుతుంది. ఇంకా మన శరీరానికి అనేక ఆరోగ్యపరమైన లాభాలను కలుగజేస్తుంది.

    5. హజ్ యాత్ర

    సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా నగరానికి, ఆర్ధికంగా మరియు శారీరకంగా తగిన స్తోమత కలిగి ఉన్న ముస్లింలు తమ జీవితంలో కనీసం ఒక్కసారి హజ్ యాత్ర చేయవలసి ఉన్నది. అది ప్రతి సంవత్సరం ఇస్లామీయ క్యాలెండరులోని 12వ నెలలో జరుగుతుంది. జాతి, వర్గ, వర్ణ, ఆస్తి, అంతస్థు, హోదా, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ నిర్ణీత దినాలలో, నిర్ణీత ప్రదేశాలలో, నిర్ణీత పద్ధతి ప్రకారం ఏకైక నిజదేవుడైన అల్లాహ్ ను ఆరాధిస్తారు. హజ్ యాత్రికులలోని మగవారందరూ అంతస్థు, హోదా, ప్రాంతీయ సంస్కృతి సంప్రదాయాలను విడిచిపెట్టి, ఒకేరకమైన రెండు తెల్లటి వస్త్రాలను ధరిస్తారు. ఆ విధంగా అల్లాహ్ వద్ద మానవులంతా సమానులేనని ఆచరణాత్మకంగా ప్రజలు మిలియన్లలో ఒకే రకమైన దుస్తులలో ఒక రోజంతా అరఫాత్ మైదానంలో ఆకాశం క్రింద నిలబడి మరీ చూపుతారు. అలాగే ఒక రాత్రంతా ఎలాంటి పైకప్పు లేని ముజ్దలిఫా మైదానంలో నేలపై నిద్రిస్తారు. ఈ పవిత్ర హజ్ యాత్రలో అనేక దశలు ఉన్నాయి – ఖుర్బానీ, ప్రయాణం, వేర్వేరు చోట్ల ప్రార్థించడం మొదలైనవి. అలాంటి అద్భుత అనుభవం వారి జీవిత దిశనే మార్చివేస్తుంది. అణుకువ, నమ్రత, మరింత సహనం మరియు ఓర్పు కలిగిన వ్యక్తిగా, కృతజ్ఞతలతో నిండిన వ్యక్తిగా మార్చివేస్తుంది.

    ఇస్లామీయ ఆరాధనల భావన

    అల్లాహ్ సమ్మతించే, ఇష్టపడే ఏ పనైనా ఇస్లాంలో ఆరాధనగానే పరిగణింపబడుతుంది.

    ఇస్లామీయ ఆరాధనల భావన కేవలం ఐదు ఇస్లామీయ మూలస్థంభాలకే పరిమితం కాలేదు. అల్లాహ్ సమ్మతించే, ఇష్టపడే ఏ పనినైనా సూచించే ఒక సమగ్రమైన పదమే ‘ఆరాధన’. ఇస్లామీయ భావనలో ఆరాధన అనేది కేవలం ఐదు ఇస్లామీయ మూలస్థంభాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆరాధన అనే సమగ్రమైన పదంలో అల్లాహ్ ఇష్టపడే ప్రతిదీ వస్తుంది. పరిశుద్ధ సంకల్పంతో చేయడం మరియు అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరించి చేయడం ద్వారా మన దినచర్యలు కూడా ఆరాధనలుగా పరిగణింపబడే అవకాశం ఉన్నది. ఉదాహరణకు, చిరునవ్వు, ఇరుగు పొరుగు వారితో మంచిగా ప్రవర్తించడం, తన కుటుంబానికి సహాయపడటం, నిజాయితీ గా జీవించడం మరియు రోడ్డుపై నుండి ఆటంకాన్ని తొలగించడం మొదలైనవన్నీ.

    ఒకరి ఆరాధనల అవసరం అల్లాహ్ కు లేదు కానీ, అల్లాహ్ యొక్క అవసరం మనకు ఉన్నది, మన ఆరాధనలు మన ప్రయోజనం కొరకే అనే విషయాన్ని మనం గుర్తించాలి.

    చివరి మాట

    పైన పేర్కొనబడిన విశ్వాసం యొక్క మూలస్థంభాలు మరియు ఆరాధనలు కలిసి ఇస్లాం ధర్మం యొక్క ముఖ్య సారాంశం అవుతుంది. వాటిని ఆచరణలో పెడితే అది ప్రజలందరి ఆధ్యాత్మిక, శారీరక, మానసిక మరియు సాంఘిక అవసరాలను చక్కగా తీరుస్తాయి. అంతేగాక ఇస్లాం ఒక హేతబద్ధమైన మరియు ఆచరణాత్మకమైన జీవిత విధానం. ఇంకా, ఈ జీవిత విధానాన్ని మాత్రమే సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ సమ్మతిస్తాడు. శాశ్వతంగా స్వర్గానికి చేర్చే ఏకైక మార్గం ఇదే.

    “ఏ పురుషుడూ గానీ లేదా స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.” ఖుర్ఆన్ 16:97

    http://islamicpamphlets.com/about-islam-brief-introduction/

    معلومات المادة باللغة الأصلية