الوصف
مقالة مترجمة إلى اللغة التلغو تتناول قضية الحجاب الشرعي كما جاء به الإسلام وذلك من خلال عدة نقاط، فهي تؤكد على أن الحجاب طاعة وحياء وحماية وكرامة واحترام للنفس وللآخرين وان يعطي الإنسان ثقة في نفسه. تطرقت المطوية أيضًا إلى ذكر الحجاب في الكتاب المقدس.
హిజాబ్
హిజాబ్ అంటే ఏమిటి?
అరబీ భాషలోని ‘హజబ’ అనే మూలపదం నుండి ’హిజాబ్’ అనే పదం వచ్చింది. దీని అర్థం దాచడం లేక కప్పడం. ఇస్లామీయ పరిభాషలో హిజాబ్ అనే పదం ‘యుక్తవయస్కులైన (రజస్వలైన) ముస్లిం మహిళలు ధరించ వలసిన దుస్తుల’ను సూచిస్తుంది. మొత్తం శరీరాన్ని పూర్తిగా కప్పే లేక దాచే విధంగా ఆ దుస్తులు ఉండాలి. చేతులు మరియు ముఖానికి మినహాయింపు ఉందని కొందరు పండితుల అభిప్రాయం. కొందరు చేతులు మరియు ముఖం కూడా కప్పుకోవడాన్ని లేక దాచుకోవడాన్ని ఇష్టపడతారు. దీనిని నిఖాబ్ లేక బురఖా అంటారు. కేవలం మహిళలు మాత్రమే ఉన్న ప్రాంతంలో వారు హిజాబ్ లో ఉండవలసిన అవసరం లేదు. అలాగే వివాహబంధం నిషేధింపబడిన మహ్రమ్ పురుషుల సమక్షంలో కూడా. అయితే హిజాబ్ అనేది కేవలం బహిరంగ ప్రదర్శన గురించి జాగ్రత పడటం మాత్రమే కాదు; హిజాబ్ లో ఉత్తమ పలుకులు, పాతివ్రత్యం, సచ్ఛీలత, గౌరవప్రదంగా మరియు హుందాగా ఉండే నైతిక ప్రవర్తన మొదలైనవన్నీ వస్తాయి. ఇలాంటి మంచి గుణగణాలను పురుషులు కూడా అలవర్చు కోవలసిన అసరం ఉన్నది. ముస్లిం పురుషులు కూడా తమ హుందాతనం మరియు సచ్ఛీలతలను సూచించేట్లు వదులుగా ఉండే మరియు శరీర భాగాలు కనబడనీయకుండా కప్పి ఉంచే మంచి దుస్తులు ధరించ వలసి ఉన్నది.
హిజాబ్ కూడా దైవవిధేయతే.
హిజాబ్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మొట్టమొదట ఇది అల్లాహ్ ఆదేశించిన ఆజ్ఞ. కాబట్టి, దీనిని ధరించడమనేది దైవవిశ్వాసాన్ని ధృవీకరించే ఒక ఆచరణ మరియు సృష్టికర్తకు విధేయత చూపినట్లే:
“(ఓ ప్రవక్తా) తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా త్వరగా గుర్తింపబడి, వేధింపులకు గురి కాకుండా ఉంటారు.” ఖుర్ఆన్ 33:59
తన సృష్టికోసం ఏది మంచిదో అత్యంత వివేకవంతుడైన అల్లాహ్ కు బాగా తెలుసు. తద్వారా ఆయన మానవజాతికి ప్రయోజనకరమైన మార్గదర్శకత్వాన్ని పంపినాడు. ఇతర విధేయతా పూర్వకమైన ఆచరణల వలే, హిజాబ్ ధరించడం కూడా తమ ప్రభువు దగ్గరికి చేరుస్తుంది. ధరించే వారిలో సంతృప్తి భావనలు మరియు ప్రశాంతత పెంపొందిస్తుంది. ఎట్టిపరిస్థితులలోనూ హిజాబ్ వస్త్రధారణ వలన పురుషుల స్థాయి కంటే మహిళల స్థాయి దిగజారిపోదు.
హిజాబ్ అనేది ప్రాతివత్యం, సచ్ఛీలతలను సూచిస్తుంది
ఇస్లాం ధర్మం సమాజంలో ప్రాతివత్యం, సభ్యతా సంస్కారాలను ప్రోత్సహిస్తుంది మరియు అసభ్యత, పోకిరీతనం, అనైతికతలను సాధ్యమైనంతగా తగ్గించాలని ప్రయత్నిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో హిజాబ్ మరియు ఇలాంటి ఇతర విషయాలు సహాయపడతాయి.
“(ఓ ప్రవక్తా) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదనీ వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. (ఓ ప్రవక్తా) ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గతమై ఉండేది తప్ప తమ అలంకరణను బహిర్గతం చేయరాదని, తమ వక్షస్థలాలపై ఓణీలు వేసుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కొడుకులు లేక తమ అక్కాచెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలిసి మెలిసి ఉండే స్త్రీలు లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి అవగాహన లేని బాలురు – వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను కనబడనీయకూడదనీ, దాగివున్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదనీ వారితో చెప్పు …” ఖుర్ఆన్ 24:30-31
పై ఖుర్ఆన్ వచనాలలో, తమ కంటి చూపు క్రింద ఉంచుకోవాలని మరియు తమ శీలాన్ని కాపాడుకోవాలని ముందుగా పురుషులను సంబోధించడం జరిగింది. సచ్ఛీలత, ప్రాతివత్యం బాధ్యతంతా మహిళల పైనే వేయబడిందనే తప్పుడు వాదనను ఇది స్పష్టంగా ఖండిస్తున్నది.
బహిరంగంగా అసాంఘిక దుస్తులు ధరించడం మరియు కొంటె చేష్టలు చేయడం వంటి వాటిని ఇస్లాం ధర్మం ఖండిస్తున్నది. ఒక ఆచరణాత్మకమైన జీవన విధానంగా, ఇస్లాం ధర్మం ఏకాంతంలో భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు, ఆత్మీయత మరియు సాన్నిహిత్యం పెరగాలని ప్రోత్సహిస్తుంది.
హిజాబ్ ఒక రక్షణ కవచం
హిజాబ్ వెనుకనున్న అసలు వివేకం ఏమిటంటే దాని ద్వారా స్త్రీపురుషులలో వీలయినంతగా లైంగిక ప్రలోభాలు మరియు వేధింపులు, కొంటెపనులు, కవ్వింపులు మరియు నైతిక పతనాన్ని సూచించే చెడు పనులు వంటి వాటిని తగ్గించడం. హిజాబ్ వ్యవస్థ క్రింది పేర్కొనబడిన అనేక విధాలుగా ఇరువైపు కుటుంబాలలో మరియు సమాజాలలో పురుషులను, స్త్రీలను మరియు సమాజాన్ని కాపాడుతుంది:
· అవాంఛిత పనులలో ముందడుగు వేయకుండా కవచం వలే మహిళలను కాపాడుతుంది.
· వికృత చూపులు మరియు అసకభ్యకర చేష్టల నుండి మహిళలను సంరక్షిస్తుంది.
· మహిళలపై లైంగిక వేధింపులు తగ్గించేందుకు సహాయపడుతుంది.
· బహిరంగ మేకప్పుల, ఆకర్షణల కారణంగా జరిగే లైంగిక ఆక్రమణల నుండి మహిళలను కాపాడుతుంది.
· చెడు ప్రేరణలు మరియు నష్టదాయకమైన కోరికల నుండి మహిళలను రక్షిస్తుంది.
హిజాబ్ హుందాతనానికి చిహ్నం
హిజాబ్ మహిళల స్త్రీత్వాన్ని హెచ్చిస్తుంది, ప్రోత్సహిస్తుందే గానీ దానిని అణచి వేయడం లేదు. మహిళలకు హుందాతనాన్ని ఇస్తున్నది. తమపై , తమ అందచందాలపై వ్యాఖ్యానించే అవకాశాన్ని ఇతరులకు ఇవ్వకుండా, తమ స్వంత అభిప్రాయాలపై నిలబడేలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. వారెంత అందంగా కనబడుతున్నారు, వారెంత సంపాదిస్తున్నారు వంటి భౌతిక ఆకర్షణల ఆధారంగా వారి విలువ గురించి హుకుంలు జారీ చేసే కన్సూమర్ సొసైటీల దుర్వ్యవస్థకు భిన్నంగా వారి సచ్ఛీలత, జ్ఞానం మరియు సామాజిక సహాయసహకారాలు వంటి అర్థవంతమైన ప్రామాణికతల ఆధారంగా వారి ఆత్మగౌరవాన్ని రూపుదిద్దుకోగలిగే శక్తిని ఇస్లాం ధర్మం మహిళలకు ఇస్తున్నది. అల్లాహ్ దృష్టిలో, స్త్రీపురుషులు సరిసమానం అయ్యేందుకు వారుభయులూ ఒకేలా ఉండవలసిన అవసరం లేదు, ఒకే విధమైన పనులు చేయవలసిన అవసరమూ లేదు. వారికి ఇవ్వబడిన వేర్వేరు పాత్రలలో మరియు బాధ్యతలలో ఇది స్పష్టంగా కనబడుతుంది.
నోబుల్ ప్రైజ్ విజేత తవక్కుల్ కర్మాన్ (The mother of Yemen’s revolution) ను జర్నలిష్టులు ఆమె హిజాబ్ గురించి మరియు విద్యాభ్యాసంలో మరియు తెలివితేటలలో ఆమె ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత కూడా హిజాబ్ ధరించడాన్ని గురించి ప్రశ్నించినప్పుడు, ఆమె ఇలా జవాబిచ్చారు:
“పూర్వకాలంలో మానవుడు దాదాపు నగ్నంగా ఉండేవాడు. తన బుద్దీవివేకం పరిణితి చెందిన కొద్దీ, దుస్తులు ధరించడం మొదలు పెట్టాడు. నేను ఈ రోజు ఎలా ఉన్నానో మరియు ఏమి ధరిస్తున్నానో, అది మానవుడు సాధించిన మహోన్నత ఆలోచన మరియు నాగరికతలకు ప్రాతినిధ్యం వహిస్తున్నదే గానీ తిరోగమనాన్ని కాదు. అంతేగాక దుస్తులు త్యజించడమనేది మరలా ప్రాచీనకాలానికి చేర్చే తిరోగమనాన్ని సూచిస్తుంది.”
హిజాబ్ పరువు, గౌరవమర్యాదలకు చిహ్నం
ఈనాడు అనేక సమాజాలలో, అనేక మంది మహిళలకు బాల్యం నుండే “వారి విలువ వారి బాహ్యాకర్షణకు, అందచందాలకు ప్రపోషనల్ గా ఉంటుందని” నేర్పతున్నారు. తోటివారి అసమంజసమైన ఒత్తిడి మరియు సొసైటీ అంచనాలను సంతృప్తి పరిచేందుకు, అందచందాల మరియు ఆకర్షణల అవాస్తవమైన, అర్థం పర్థం లేని ప్రామాణికతలను అనుసరించేలా వారు ఒత్తిడికి గురవుతున్నారు. బాహ్య అలంకరణలు, అందచందాలకు అమితంగా ప్రాధాన్యత ఇవ్వబడుతున్నటు వంటి మిడిమిడి వాతావరణంలో, ఏ వ్యక్తి అయినా అంతర్గత సౌందర్యానికి అంతగా విలువ ఇవ్వడు.
ఏదేమైనా చూపులు లేక శారీరక అందచందాల ఆధారంగా కాకుండా ఆమె యొక్క సద్గుణాలు మరియు ఆచరణల ఆధారంగానే ఒక మహిళ గౌరవించబడాలని ఇస్లాం ధర్మం బోధిస్తున్నది. ఎందుకంటే తన బాహ్య అందచందాలపై ఆమెకు చాలా తక్కువ కంట్రోల్ ఉంటుంది లేదా అసలు కంట్రోల్ యే ఉండదు, పైగా అవి తాత్కాలికమైనవి. సమాజంలో గుర్తింపు పొందడం కోసం లేక స్ధానం సంపాదించడం కోసం ఆమె తన శారీరక అందచందాలను మరియు ఆకర్షణలను వాడుకోవలసిన అవసరం లేదు. అందువలన హిజాబ్ మహిళల ఆత్మగౌరవానికి సముచిత స్థానాన్నిస్తూ, బాహ్య ఆకర్షణలకు దూరంగా మహిళలందరూ సులభంగా పాటించగలిగే ధర్మనిష్ఠ, ధార్మిక చింతన, సద్గుణం, సత్ ప్రవర్తన, సుశీలత, అణుకువ, సిగ్గుబిడియం, పాతివ్రత్యం, ముగ్దత్వం మరియు బుద్ధీవివేకం మొదలైన వాటికి గొప్ప ప్రాధాన్యతను ఇస్తున్నది.
హిజాబ్ లేదా బురఖా ధరించే ప్రతి మహిళ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తించబడుతున్నది. తాము ధరించిన దుస్తులు ఒకేలా ఉండటం వలన, హిజాబ్ లేదా బురఖా వేసుకుంటున్న మహిళలందరి గురించి ఒకే రకమైన భారీ తీర్పునివ్వడం చాలా తప్పు మరియు అన్యాయం.
బైబిల్ లో హిజాబ్ ప్రస్తావన
హిజాబ్ అనేది కొత్తగా ఆదేశించబడలేదు. ముస్లిం మహిళలు జీసస్ తల్లి మర్యమ్ వంటి పూర్వకాలంలోని ఉత్తమ మహిళల ఉపమానాలను అనుసరిస్తున్నారు. హిజాబ్ ను ధృవీకరిస్తున్న బైబిల్ లోని కొన్ని వచనాలు,
“ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషు డనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తలమీదముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును.ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీకవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను. ” 1కొరింథీయులకు 11:3-6
“మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగు మాత్రపు వస్త్రముల చేతనేగాని, జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను మిగుల వెల గల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్ క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.” 1 తిమోతికి 2:9-10
హిజాబ్ ఆత్మవిశ్వాసానికి చిహ్నం
తాము కూడా మానవులే అనే ఆత్మవిశ్వాసం తమలో పెంపొందించుకునేలా హిజాబ్ మహిళలకు సహాయపడుతుంది. జీవితంలో పనికి వచ్చే అసలు విషయాలపై దృష్టి కేంద్రీకరించేలా చేసి మహిళలలోని ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. భౌతిక ఆకర్షణలతో ఇతరులపై ప్రభావం చూపేందుకు ప్రయత్నించడంలో చాలా ప్రమాదకరమైన మరియు అనారోగ్యకరమైన పర్యవసనాలు ఎదుర్కోవలసి వస్తుంది. కొందరు స్త్రీలైతే, విచ్ఛలవిడితనంలో రోజురోజుకీ పెరిగి పోతున్న సమాజం డిమాండ్ ను పూర్తిచేసెందుకు ప్రయత్నిస్తూ, ప్రజలు తమను మెచ్చుకోవాలనే ఆకాంక్షతో నైతిక హద్దులు దాటి, ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటున్నారు. తమపై తమకు నమ్మకం లేని అలాంటి స్థితి నుండి మానసికంగా మరియు శారీరకంగా కాపాడేందుకు హిజాబ్ సహాయ పడుతుంది. బాహ్య అలంకరణలను తమ స్వంత స్పృహ లోపలే తగిన హద్దులలో ఉంచుతుంది.
“అణచివేయబడటం వలన నేను దానిని ధరించడం లేదు, నాపై నాకు సాధికారాన్ని ఇస్తుండటం వలన నేను దానిని ధరిస్తున్నాను.” జౌమానా , 23, మెలబోర్న్
హిజాబ్ అంటే …
· సమాజానికి తోడ్పాటును అందజేయకుండా అంతరాయం కలిగించే ఆటంకం కాదు.
· అణచివేతకు చిహ్నం కాదు.
· కేవలం స్త్రీలు మరియు దగ్గరి రక్తసంబంధీకులైన పురుషులు ఉన్నచోట అవసరం కాదంటూ వెసులు బాటునిస్తున్నది.
· పురుషుల కంటే స్త్రీలను తక్కువగా చూపే చిహ్నం కాదు.
· తన అభిప్రాయాలు మరియు ఆలోచనలు బయటికి చెప్పకుండా స్త్రీలను నిర్భందించే వ్యవస్థ కాదు.
· విద్యార్జన చేయకుండా లేక సముచితమైన ఉద్యోగంలో చేరకుండా స్త్రీలను నిర్భంధించే వ్యవస్థ కాదు.
· ఒక పోర్టబుల్ జైలు వంటిది కాదు.
· ముస్లిమేతరులకు వ్యతిరేకంగా ధిక్కరణ, ప్రతిఘటన లేక నిరసన చర్య కాదు.
· కొత్తగా మొదలు పెట్టింది కాదు – చారిత్రక పరంగా అనేక మంది ఉత్తమ స్త్రీలు దీనిని ధరించేవారు.
· సామాజిక విలువలకు వ్యతిరేకం కాదు – ఎలాంటి దుస్తులు ధరించారో అనే దాని మీద ఆధారపడి ప్రజల గురించి తీర్మానించకూడదని, వేరుగా చూడకూడదని, అవమాన పరచకూడదని సామాజిక విలువలు చెబుతున్నాయి. తమకు ఇష్టమైన రీతిలో దుస్తులు ధరించే మరియు ఇంటి నుండి బయటికి వచ్చే హక్కు ప్రజలకు ఉంది.
· ఇతరులను భయపెట్టుటకు లేదా అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనేందుకు ధరించడం లేదు.
కొందరు ముస్లిం మహిళలు హిజాబ్ గురించి ఏమంటున్నారు
“17 ఏళ్ళ వయస్సులో నేను దానిని ధరించాను. అయితే అంతకు ముందు నుండే ఎందుకు ధరించడం ప్రారంభించలేదని నేను బాధ పడ్డాను. .” ఫాతెన్, 27, మెల్ బోర్న్
“దానిని ధరించేందుకు సిద్ధం పడటం గొప్ప కాదు. అయితే దానిని ధరించేంత అదృష్టం పొందటం నిజంగా ఒక గొప్ప విషయం.” మదీనా, 22, మెల్ బోర్న్
“హిజాబ్ దుస్తులు నా స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు మరియు నా ఛాయిస్ లను సూచిస్తున్నాయి. అంతేగాని పురుషుల మరియు మీడియా కోరికలకు బలయ్యే నా అణచివేతను కాదు.” నుసైబాహ్, 45, మెల్ బోర్న్
“హిజాబ్ వేసుకోవడం నాకెంతో ఇష్టం. ఎందుకంటే, నేనది అల్లాహ్ కోసం చేస్తున్నాను. నేనెప్పుడు దాని గురించి ఆలోచించినా, నా ముఖంపై చిరునవ్వు కనబడుతుంది.” ఆయెషా,13, మెల్ బోర్న్
“అది పురుషుల ఆకలి చూపుల నుండి నన్ను కాపాడుతూ, స్వేచ్ఛగా ఉన్నత విద్యనభ్యసించడం మరియు విద్యాలయాలకు వెళ్ళడం వంటి నా లక్ష్యాల్ని సాధించేందుకు అనుమతిస్తుంది. నా బయటి అలంకరణల ఆధారంగా నన్ను గురించి తీర్మానించుకోకుండా, నా ఆలోచనలు మరయు నా సద్గుణాల ఆధారంగా నా గురించి తీర్మానించుకునేలా ప్రజలపై ఒత్తిడి చేస్తుంది.” Ms. ఫ్లావియా, 22, అమెరికా
“నా శరీరం నా ఇష్టం. నేనేమి ధరిస్తున్నానో దాని గురించి ఇతరులకు సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం లేదు. ఇది నా ధర్మంలోని ఒక భాగం. నేను ధరించాలని ఎంచుకోవడం ద్వారా నేను ఇతర మానవుల కంటే తక్కువగా దిగజారి పోవడం లేదు.” Ms. యాస్మిన్, 21, ఆస్ట్రేలియా
ముగింపు
ఒక ముస్లిం మహిళకు మరియు ఆమె సృష్టికర్తకు మధ్య హిజాబ్ అనేది విధేయతాపూర్వకమైన ఒక ఉత్తమ ఆచరణ. అది స్వాధికారం మరియు ఆత్మగౌరవాలకు మూలం. తమ దైవవిశ్వాసంలో భాగంగా ప్రపంచం నలుమూలలా మిలియన్ల కొద్దీ ముస్లిం మహిళలు స్వచ్ఛందంగా హిజాబ్ వేసుకోవడాన్ని ఎంచుకుంటున్నారు. అణచివేతకు బహుదూరంగా, హిజాబ్ అనేది నిజమైన స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకు, పవిత్రతకు మరియు అతి ప్రధానంగా దైవవిశ్వాసానికి ప్రతీక. ఇస్లామీయ బోధనలలో స్త్రీలను గౌరవించడమనేది ఎంతో ముఖ్యమైన విషయం. ఇది హిజాబ్ వ్యవస్థ ద్వారా నిరూపించబడుతున్నది.
ఏనాడైతే సమాజంలో స్టేటస్ కోసం స్త్రీలు తమను తాము బహిరంగంగా చూపుకోవలసిన దీనస్థితి రాదో, మరియు స్త్రీలు తమ శరీరాన్ని తమ ఇష్టప్రకారం దాచుకునే స్వంత నిర్ణయాన్ని సమర్ధించుకోగలుగుతారో అప్పుడే నిజమైన సమానత్వం స్థాపించబడుతుంది.