×
جدبد!

تطبيق موسوعة بيان الإسلام

احصل عليه الآن!

مبادئ توجيهية للحاج (تلقو)

الوصف

مقالة مترجمة إلى اللغات المختلفة كدليل الحجاج سنة 2007.

تنزيل الكتاب

    హజ్ యాత్రికుల కోసం కొన్ని ముఖ్య సూచనలు

    1. కేవలం అల్లాహ్ కోసమే మీ సంకల్పాన్ని నిశ్చయించుకోవటం.

    ఉమ్రా లేక హజ్ యాత్ర కేవలం అల్లాహ్ కోసమే చేస్తున్నామని దృఢసంకల్పం చేసుకోవలెను. ఈ పుణ్యయాత్రలో వెచ్చించే సమయానికి, సంపదకు, శారీరక ప్రయాసలకు ప్రసాదించబడే ప్రతిఫలితం మీ సంకల్పంలోని చిత్తశుద్ధి మరయు అల్లాహ్ ను మెప్పించే మీ ప్రయత్నంలోని దైవసమర్పణ, భయభక్తుల పై ఆధారపడి ఉంటుంది. దివ్యఖుర్ఆన్ లో సూరహ్ బఖరా 2:197 లో అల్లాహ్ హజ్ యాత్రికులను ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు - ‘హజ్ యాత్రకు ప్రయాణ సామగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నింటికంటే ఉత్తమమైన సామగ్రి’. ఇంకా ఇదే వచనంలో అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు ‘అరఫాత్ నుండి బయలుదేరి, మష్ అఁరె హరామ్ వద్ద ఆగి, అల్లాహ్ ను స్మరించండి. అల్లాహ్ మీకు హితోపదేశం చేసిన విధంగా ఆయనను ధ్యానించండి’. చేసిన పాపాల గురించి పశ్చాత్తాపం, తౌబా (క్షమాపణ వేడుకోవటం), అల్లాహ్ ధ్యానం, నమాజు, ఖుర్ఆన్ పఠనం, ఇంకా మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని అల్లాహ్ తప్పక చూస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోవటం, మరియు తోటివారికి కష్టం, నష్టం కలిగించకుండా సహనంతో , ఓర్పుతో మెలగటం, వీలయినంత ఎక్కువగా సహాయసహకారాలు అందించటం మొదలైన వాటిని మీరు అత్యుత్తమైన విధంగా ఆచరించటానికి ప్రయత్నించవలెను. సహీహ్ బుఖారీ హదీథ్ గ్రంథంలోని ‘హజ్జె మబ్రూర్ (అంటే సున్నత్ ప్రకారం చేసిన హజ్) వలన గతంలో చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి’ అనే ముఖ్యవిషయం తప్పక గుర్తుంచుకోవలెను. కాబట్టి హజ్ యాత్రను చాలా జాగ్రత్తగా, ప్రతి అడుగు అల్లాహ్ స్వీకరించే విధంగా వేయవలెను. ప్రతి మాట అల్లాహ్ మెచ్చే విధంగా పలక వలెను. అల్లాహ్ యొక్క ధ్యానం, ఆయా ఆరాధనా పద్ధతులతో పాటు ఇతరులకు ఎటువంటి కష్టం కలిగించకుండా హజ్ యాత్ర పూర్తి చేయటానికి మనస్పూర్తిగా ప్రయత్నించవలెను.

    2. హజ్, ఉమ్రా మరియు వాటికి సంబంధించిన నియమ నిబంధనలను నేర్చుకోవటం.

    ప్రతి ఒక్కరు హజ్ యొక్క షరతులు మరియు తప్పని సరిగా ఆచరించవలసిన ఆచరణలు, హజ్ యొక్క మూలస్థంభాలు మరియు సున్నత్ విధానములు పూర్తిగా నేర్చుకుని అల్లాహ్ ఆదేశించిన ఈ ఆరాధనను సరైన జ్ఞానంతో ఉత్తమంగా నెరవేర్చటానికి ప్రయత్నించవలెను. హజ్ గురించి తెలుసుకునే అన్ని సౌకర్యాలు ఉన్నా, స్వయంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా, అజ్ఞానంతోనే ఏదో విధంగా పూర్తిచేయాలనుకోవటం ఎంతటి అవివేకం. అజ్ఞానం వలన చేయవలసిన ఆచరణలు వదిలివేయటం లేక చేయకూడని పనులు చేయటం ద్వారా తప్పులు జరిగి, పాపములు జరిగి, హజ్ నిర్వీర్యం కావటానికి అవకాశం ఉన్నది. పూర్వకాలంలోను మరియు ప్రస్తుత కాలంలోను అనేక మంది ఇస్లామీయ పండితులు (ఉలేమాలు) హజ్ యాత్ర గురించి వివరంగా వ్రాసిన అనేక పుస్తకములు వివిధ భాషలలో మనకు అందుబాటులో ఉన్నాయి. హజ్ యాత్రికులు వీటిని చదవ వలెను. ఏదైనా విషయం అర్థం కాకపోతే, పండితులను(ఉలేమాలను) లేక జ్ఞానవంతులను సంప్రదించి తెలుసుకోవలెను.

    3. పాపముల నుండి క్షమాపణ వేడుకోవటం (తౌబా చేయటం)

    దివ్యఖుర్ఆన్ సూరహ్ అత్ తహ్రీమ్ 66:8 - అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు - “ఓ విశ్వసులారా! చిత్తశుద్ధితో క్షమాపణ వేడుకుంటూ అల్లాహ్ వైపుకు మరలండి”

    నిజమైన తౌబా (అంటే పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ) యొక్క చిహ్నాలు:-

    ü చెడు పనున్నింటినీ మరియు పాపములన్నింటినీ వదిలివేయటం.

    ü చేసిన చెడు పనుల మరియు పాపముల గురించి చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడటం.

    ü మరల అటువంటి చెడు పనులు, పాపములు తిరిగి చేయకుండా దృఢంగా నిర్ణయించికోవటం.

    ü ఇతరులకు చెందిన సంపద, గౌరవమర్యాదలు..మొదలైన వాటిని తిరిగి వారికి అప్పగించడం.

    ü హజ్ యాత్ర ఖర్చుల కోసం ధర్మబద్ధమైన (హలాల్) సంపాదనను ఎన్నుకోవడం.

    ప్రతి ఒక్కరు హజ్ చేయటం కోసం ధర్మబద్ధమైన (హలాల్) పద్ధతి ద్వారా సంపాదించిన ధనాన్ని మాత్రమే ఎన్నుకోవలెను. ఎవరైనా హజ్ యాత్ర పూర్తిచేసినా గాని, ఒకవేళ వారి సంపాదన అధర్మ పద్ధతుల ద్వారా సంపాదించినదైతే, వారి హజ్ స్వీకరించబడినదనటానికి ఎటువంటి గ్యారంటీ లేదు. ఒక హదీథ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు “ఒకవేళ ఎవరైనా పవిత్రమైన సంపాదనతో హజ్ యాత్రకు బయలుదేరినట్లయితే, వాహనంలో మొదటి అడుగు పెట్టి ‘లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్’ అని పలకగానే, ‘లబ్బైక్ వశ్శాదిఖ్, మీ సామానులు పవిత్రమైనవి, మీ వాహనం పవిత్రమైనది మరియు మీ హజ్ స్వీకరించబడుతుంది’ అని ఆకాశం నుండి జవాబు వస్తుంది.” కాని ఒకవేళ ఎవరైనా అధర్మపద్ధతిలో సంపాదించిన ధనంతో హజ్ యాత్రకు బయలుదేరినట్లయితే, వాహనంలో మొదటి అడుగు పెట్టి ‘లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్’ అని పలకగానే, ‘లా లబ్బైక్ వశ్శాదిఖ్, మీ సామానులు అపవిత్రమైనవి, మీ వాహనం అపవిత్రమైనది మరియు మీ హజ్ పాపములతో నిండి ఉన్నది మరియు అది స్వీకరించబడదు’ అని ఆకాశం నుండి జవాబు వస్తుంది.” కాబట్టి హజ్ యాత్ర ఖర్చులకు కేవలం పవిత్రమైన, ధర్మంగా మరియు ఇతరుల హక్కులను ఉల్లంఘించకుండా సంపాదించిన ధనం మాత్రమే వెచ్చించవలెను. హజ్ ప్రయాణం కోసం మంచి నడవడిక గల స్నేహితులను ఎన్నుకోండి. ప్రయాణ సంప్రదాయములు (ఆదాబె సఫర్), ప్రయాణంలో చేసే వివిధ దుఆ (ప్రార్థన) లు ముందుగా తెలుసుకోవలెను. ప్రయాణ ప్రారంభంలో చేయవలసిన ప్రార్థనలు మీకు తెలుపబడును. వాహనం ఎత్తుగా ఉండే ప్రదేశం వైపుకు ప్రయాణించేటప్పుడు ‘అల్లాహ్ అక్బర్’ అని, పల్లం వైపుకు ప్రయాణించేటప్పుడు ‘సుభహానల్లాహ్’ అని, దారిలో విరామం కోసం ఆగినప్పుడు ‘అఊదు బి కలిమాతిల్లాహిత్తామత మిన్ షర్రి మా ఖలఖ్’ అంటే ‘అతడే సృష్టించిన దుష్టశక్తుల బారి నుండి నేను పవిత్రమైన, సంపూర్ణమైన అల్లాహ్ యొక్క పదాల ద్వారా రక్షణ వేడుకుంటున్నాను’ అని ప్రార్థించినట్లయితే విశ్రాంతి ప్రదేశాలలో వారికి అల్లాహ్ కృప వలన ఎటువంటి హాని కలుగదు.

    4. హజ్ యాత్రికులకు కొన్ని ముఖ్యసూచనలు

    5.

    1. నమాజు సమయం అయినప్పుడు, వెంటనే చేస్తున్న పని ఆపి, నమాజు కోసం తయారు కావలెను. నమాజును ఆలస్యం చేసే లేక నమాజు ను నిరోధించే ఏ పనిలోను అల్లాహ్ యొక్క శుభాలు ఉండవు.

    2. మీ ఖాళీ సమయాలలో, వీలయినంత ఎక్కువగా ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం చేయటానికి ప్రయత్నించవలెను. మీరు చదివే ప్రతి ఒక్క అక్షరానికి కనీసం 10 పుణ్యాలు ప్రసాదించబడతాయనే హదీథ్ ను మరిచిపోవద్దు.

    3. తోటి వారితో మంచిగా ప్రవర్తించండి, ఉత్తమమైన పద్ధతిలో వ్యవహరించండి.

    4. ఎటువంటి ప్రయోజనం కలిగించని అనవసర విషయాల గురించిన వాదనలు, ఘర్షణలు చేయవద్దు. దీని వలన మీ అమూల్యమైన దుఆల సమయం వృధా అయిపోతుంది. అల్లాహ్ వీటిని నిషేధించాడు. సూరహ్ బఖరా 2:197 వచనంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు ‘హజ్ సమయంలో అతడు కామచేష్టలకూ, దుష్కార్యాలకూ, ఘర్షణలకూ దూరంగా ఉండాలి. మీరు చేసే ప్రతి పుణ్యకార్యం అల్లాహ్ కు తెలుస్తుంది’. కాబట్టి హజ్ యాత్రకోసం సంకల్పం (నియత్) చేసుకున్న ప్రతి ఒక్కరు, అన్ని విధాల తప్పుడు మాటలను, అశ్లీలపు (బూతు) పదాలను పలుకరాదు. నాలుకను పూర్తిగా అదుపులో ఉంచుకోవలెను. ఏదేని కారణం వలన అల్లాహ్ యొక్క ధ్యానంలో, స్మరణలో నాలుకను బిజీగా ఉంచలేకపోయినా, అనవరపు నిషేధించబడిన మాటలలో దానిని బిజీ చేయవద్దు. కాబట్టి ప్రతి హజ్ యాత్రికుడు అరఫాత్, మీనా, ముజ్దలిఫాలలోని ఈ ఉత్తమమైన సమయాన్ని తమకు ఇహపరలోకాలలో ప్రయోజనం కలిగించే ఇస్లామీయ ధర్మవిషయాలు నేర్చుకోవటంలో, తోటివారికి సహాయ పడటంలో, అల్లాహ్ యొక్క ధ్యానంలో, వివిధ ఆరాధనలలో, ప్రార్థనలలో పూర్తిగా గడపవలెను. హాని కలిగించే విషయాల నుండి, మాటల నుండి, సమయాన్ని వృధా చేయటం నుండి దూరంగా ఉండవలెను.

    5. ఇస్లాం ధర్మం ప్రకారం జీవిస్తున్న స్నేహితుడితో హజ్ యాత్ర చేయటానికి ప్రయత్నించండి. తోటివారిలో అటువంటి వ్యక్తిని కనిపెట్టి వారితో ఎక్కువగా ఉండటానికి ప్రయత్నించవలెను.

    6. మీకు అందజేయబడిని వివధ ఇస్లామీయ కార్యక్రమముల నుండి ప్రయోజనం పొందటానికి ప్రయత్నించవలెను.

    7. మీ గ్రూపులోని ముఅఁల్లిమ్ (బాధ్యులైన వారు) అనుమతి లేకుండా ఆయా ప్రాంతాల నుండి వేరే చోటుకి వెళ్ళవద్దు. మీకు వేరే చోటుకి వెళ్ళవలసిన అవసరం ఏర్పడినట్లయితే, ఆరోగ్యం పాడైతే, అలసిపోతే, మీ గ్రూపు ముఅఁల్లిమ్ (సూపర్ వైజరు)కు వెంటనే తెలియజేయవలెను. దీని వలన మీకు త్వరగా సహాయం అందించటానికి అవకాశం ఉంటుంది.

    8. ప్రయాణ సౌలభ్యం కోసం మన కేంద్రం నుండి హజ్ కు వెళ్ళుతున్న వారందరినీ కొన్ని గ్రూపులుగా విభజించి, ఒక్కో గ్రూపుకు ఒక్కో ముఅఁల్లిమ్ (సూపర్ వైజర్)ను నియమించటం జరుగుతుంది. మీకు కేటాయించబడిన గ్రూపు పేరు (నెంబరు), ముఅఁల్లిమ్ పేరు, మొబైల్ నెంబరు, మీనాలోని టెంట్ నెంబరు తప్పక గుర్తుంచుకోవలెను. ఒక గ్రూపులోని వారు వేరే గ్రూపువారితో అనుమతి లేకుండా ఎక్కువ సమయం గడపటం నిషేధించబడినది.

    9. హజ్ యాత్ర మొదలైనప్పటి నుండి తిరిగి వచ్చేవరకు పొగత్రాగటం (సిగరెట్) పూర్తిగా నిషేధించబడినది. ఒంటరిగా ఉన్నా (బాత్రూమ్ లోనైనా సరే), అందరితో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, తమ తమ టెంట్ లలో ఉన్నా - ఏ సమయంలోను మొత్తం హజ్ యాత్రలో అస్సలు పొగత్రాగరాదు.

    10.విశ్రాంతి, విరామ సమయాలలో పూర్తి నిశ్శబ్దాన్ని పాటించవలెను.

    11.మీకు ఏదైనా సందేహం కలిగినా, ఏదైనా సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, మీ గ్రూపుకు బాధ్యత వహిస్తున్న ధర్మ ప్రచారకుడిని (దాయిని) వెంటనే సంప్రదించవలెను. ఇన్షా అల్లాహ్ మీకు సరైన సహాయం ఉత్తమమైన రీతిలో వెంటనే లభిస్తుంది. అలా వీలుపడక పోతే కనీసం మీతో ఉన్న ముఅఁల్లిమ్ (సూపర్ వైజర్) నైనా సంప్రదించ వలెను.

    6. 5. క్రింది విషయాలను మరచిపోవద్దు.

    1. ఇన్షా అల్లాహ్ మన హజ్ ప్రయాణం జిల్ హజ్ నెల 6వతేదీ అంటే 15th Dec 2007, శనివారం నాడు ప్రారంభం కాబోతున్నది.

    2. మీతో పాటు ఒరిజినల్ ఇఖామా తో పాటు దాని ఫోటోకాపీ కూడా తీసుకు రావలెను.

    3. ఉదయం 11.30 గంటలకు మస్జిదె సుదైరీ, రబువా ప్రచార కేంద్రం దగ్గర తప్పక హాజరు కావలెను.

    4. స్వంత బట్టలు, ఇహ్రామ్, బెల్టు, సబ్బు, రబ్బరు చెప్పులు, టూత్ బ్రష్, టూత్ పేష్టు మొదలైన పర్సనల్ వస్తువులు ఒక చిన్న బ్యాగులో సర్దుకుని వెంట తీసుకు రావలెను. దీనిని బస్సు క్రింది భాగంలోని లగేజీ ప్రాంతంలో ఉంచవలెను. ఇంకో ఇహ్రామ్ మరియు బెల్టు మాత్రం వేరే చేతిసంచి (ప్లాష్టిక్) లో బస్సులోని తమ తమ సీటు పై భాగంలో ఉంచవలెను.

    5. హజ్ యాత్రకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన పుస్తకాలు ముందుగానే మీకివ్వబడును. దీనితో పాటు దివ్యఖుర్ఆన్ భావం యొక్క తెలుగు అనువాదం కూడా ఇవ్వబడును.

    6. హజ్ లో ఖుర్బానీ ఇవ్వటం కోసం అవసరమైన ధనం మీతో పాటు ఉంచుకో వలెను.

    7. మీతో పాటు బ్లాంకెట్లు, పరుపులు తీసుకు రావద్దు. అవసరమైన చోట అందజేయబడును.

    8. ప్రతి ఒక్కరు తోటి ప్రయాణికుడికి వీలయినంతగా సహాయసహకారాలు అందజేయటానికి మనస్పూర్తిగా ప్రయత్నించవలెను. వారు కూడా మీలాగే అల్లాహ్ యొక్క గౌరవ అతిథులనే విషయం మరచిపోవద్దు.

    6. అత్యంత ముఖ్యమైన విషయం

    ఇక్కడ నుండి మా గ్రూపులో బయలుదేరిన హజ్ యాత్రికులందరూ, తిరిగి ఇక్కడకు వచ్చే వరకు ఎట్టిపరిస్థితులలోను ఎటువంటి కారణం వలనైనా సరే, గ్రూపును వదలకూడదు. ఎవరైనా తమ దూరదేశాల నుండి హజ్ కోసం వచ్చిన బంధువులను, స్నేహితులను కలవాలనే ఆలోచనలతో ఉన్నట్లయితే, ఇప్పుడే మాకు తెలియజేయవలెను. మక్కా చేరిన తర్వాత, మా గ్రూపును వదిలి వేరే వారితో గడపటం పూర్తిగా నిషేధించబడినది. ఇది మనందరి శ్రేయస్సుకోసం లాభదాయకం.

    7. ఎమర్జన్సీ సందర్భంలో సంప్రదించ వలసిన వ్యక్తుల ఫోను నెంబర్లు చిన్న పేపరు పై వ్రాసుకుని ఎల్లప్పుడూ దగ్గరగా ఉంచుకోవలెను. మధ్య మధ్యలో వారికి ఫోను చేసి మీ క్షేమసమాచారములు తెలియజేస్తూ ఉండవలెను.

    8.హజ్ యాత్ర నుండి తిరుగు ప్రయాణంలో తీసుకు రావలసిన ముఖ్యమైన సందేశం.

    హజ్ యాత్రలో ఎక్కువ సమయం స్మరిస్తూ, పలుకుతూ, వింటూ గడిపిన తల్బియా (లబ్బైక్, అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లాషరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద, వన్నేమత, లకవుల్ ముల్క్, లాషరీక లక్) లోని లాషరీక లక్ అనే పవిత్ర ప్రవచనాన్ని జీవితాంతం పాటించాలనే దృఢసంకల్పం. ఇక నుండి కేవలం ఒక్క అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ దాస్యం చేయననే తిరుగులేని నిర్ణయం. ఏ చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా ఇక నుండి కేవలం అల్లాహ్ నే వేడుకోవాలనే కృతనిశ్చయం - ఇయ్యాక నాఅఁబుదు వ ఇయ్యాక నస్తయీన్ (కేవలం నిన్నే ఆరాధిస్తాను మరియు సహాయం కోసం కేవలం నిన్నే అర్థిస్తాను) పై అచంచల విశ్వాసం. లబ్బైక్ - అల్లాహుమ్ లబ్బైక్ (హాజరయ్యాము, యా అల్లాహ్ హాజరయ్యాము) - అనే పవిత్ర ప్రవచనాలను అల్లాహ్ కు డైరక్టుగా ఎటువంటి మధ్యవర్తులు (ఇమాములు, ముజావర్లు, పూజారులు) లేకుండా విన్నవించుకుంటున్నామో, హజ్ నుండి మరలి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా సుఖసంతోషాలలో, కష్టనష్టాలలో మన వేడుకోళ్ళను కేవలం అల్లాహ్ కే సమర్పించుకోవాలనే ఏకైక లక్ష్యం. మనల్ని ప్రతి క్షణం గమనిస్తాడనే కఠోర సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకుని, అల్లాహ్ ఇష్టపడే విధంగా మన శేషజీవితాన్ని ఇస్లాం ధర్మం ప్రకారం జీవించాలనే తపన & కృషి.

    9. అల్లాహ్ మీ హజ్ యాత్రను స్వీకరించుగాక!

    10. హజ్ మబ్రూర్.......................... హజ్ మబ్రూర్..................................... హజ్ మబ్రూర్

    معلومات المادة باللغة الأصلية