×
New!

Bayan Al Islam Encyclopedia Mobile Application

Get it now!

భాగస్వామ్యం (తెలుగు)

Hazırlıq: అబ్దుల్లాహ్ రెడ్డి

Description

ఏకదైవారాధన లో భాగస్వామ్యం మరియు దానిలోని వివిధ పద్ధతుల గురించి ఈ వ్యాసంలో చర్చించబడినది.

Download Book

    అష్షిర్క్ - ఏక దైవారాధనలో భాగస్వామ్యం

    (కలయిక, సాంగత్యం, సాహచర్యం, జతచేయడం)

    బహుదైవారాధన మరియు దాని యొక్క వేర్వేరు పద్ధతులు

    నిర్వచనం: భాగస్వామ్యం (అష్షిర్క్) అంటే ప్రధానంగా బహుదైవారాధన i.e., ఏకైక ఆరాధ్యుడి(అల్లాహ్) తో పాటు ఇతరులను కూడా ఆరాధించటం. దైవత్వపు శుభలక్షణాలను అంటే దివ్యమైన సుగుణాలను అల్లాహ్ తో పాటు ఇతరులకు కూడా ఆపాదించటం (కలిగించటం). ప్రత్యేకంగా ఇది అల్లాహ్ తో పాటు ఇతరులకు ఆరాధనలలో భాగస్వామ్యం కలిగించటం లేదా 'శక్తిసామర్ధ్యాలకు మూలం, కష్టసుఖాలకు లేక మంచి చెడులకు కారణం, హాని కలగటం లేక శుభాలు కలగటానికి కారణం' అల్లాహ్ తో పాటు వేరే ఇతరులు అని విశ్వసించటం (నమ్మటం).

    రకములు: మూడు రకాల ఏకైక దైవత్వపు భాగస్వామ్యం పద్ధతులు ఉన్నాయి, అవి:

    1) అష్షిర్క్ అల్ అక్బర్, అంటే అత్యంత ఘోరమైన భాగస్వామ్యం

    2) అష్షిర్క్ అల్ అస్గర్, అంటే సామాన్యమైన భాగస్వామ్యం

    3) అష్షిర్క్ అల్ ఖఫీ, అంటే గుప్తమైన భాగస్వామ్యం

    ఏకదైవారాధన భాగస్వామ్యపు విధానములు:

    1) అష్షిర్క్ అల్ అక్బర్ (అత్యంత ఘోరమైన భాగస్వామ్యం): అత్యంత ఘోరమైన మరియు ప్రమాదకరమైన విధానము, ఇది నాలుగు విధాలుగా ఉన్నది:

    a) ప్రార్థనల (వేడుకోలు) లో భాగస్వామ్యం (షిర్క్ అద్దుఆ), i.e. ప్రార్థించటం - ఈ పద్ధతి ప్రకారం - ఏకైక దైవమైన అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను అర్థించటం, యాచించటం, దీనంగా వేడుకోవటం, ప్రార్థించటం, విన్నవించుకోవటం లేక ఆరాధించటం.

    దివ్యఖుర్ఆన్ లోని అంకబూత్ అధ్యాయం లోని 65వ వచనం (29:65) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు; “వారు నావ లోనికి ఎక్కినప్పుడు తమ విన్నపాన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకుని, ఆయననే ప్రార్థిస్తారు. కాని ఆయన వారిని రక్షించి నేలమీదకు తీసుకురాగానే ఆయనకు సాటి కల్పిస్తారు. "

    b) ప్రార్థనా సంకల్పంలో భాగస్వామ్యం (అష్షిర్క్ అన్నియ్యా వల్ ఇరాదహ్ వల్ ఖసద్: ఈ పద్ధతి ప్రకారం - ఆరాధనా విధానములలో లేక ధార్మిక ఆచరణలలో సంకల్పం, ఉద్ధేశం మరియు దృఢ నిశ్చయం ఏకైక దైవమైన అల్లాహ్ కోసం కాకుండా వేరే ఇతర దైవాల వైపునకు మళ్ళించడం. దివ్యఖుర్ఆన్ లోని హూద్ అనే అధ్యాయంలోని 15, 16 వచనాలలో (11:15, 16) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు; “ ఎవరు ప్రాపంచిక జీవిత సౌకర్యాలు మరియు దాని ఆకర్షణలను కోరుకుంటారో, వారి కర్మల ఫలితాన్ని, మేము ఈ జీవితంలోనే పూర్తిగా చెల్లిస్తాము. మరియు అందులో వారికెలాంటి లోపం జరుగదు. అయితే అలాంటి వారికి పరలోకంలో నరకాగ్ని తప్ప మరేమీ ఉండదు. వారి ఆధ్యాత్మిక సిద్ధాంతాలన్నీ (ఆ పరలోకంలో) వ్యర్థమయి పోతాయి మరియు వారి కర్మలన్నీ విఫలమవుతాయి "

    c) విధేయతలో భాగస్వామ్యం (అష్షిర్క్ అత్తఆహ్) : ఈ పద్ధతి ప్రకారం - ఏకైక దైవమైన అల్లాహ్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఇతర అధికారులకు విధేయతగా సమర్పించుకోవటం. ఖుర్ఆన్ లోని అత్తౌబా(పశ్చాత్తాపం) అధ్యాయంలోని 31వ వచనం (9:31) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు; “వారు అల్లాహ్ ను వదిలి తమ మతాచారులను, మహర్షులను మరియు మర్యమ్ కుమారుడైన మసీహ్ (జీసస్)ను తమ ప్రభువులుగా చేసుకున్నారు. వాస్తవానికి వారు ఒకే ఒక్క దైవాన్ని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించ బడినారు. ఆయన తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు. ఆయన వారు సాటి కల్పించే వాటికి అతీతుడు"

    ఒకసారి ప్రవక్త ముహమ్మద్ శల్లల్లాహు అలైహి వసల్లం పై వచనాన్ని పఠిస్తుండగా, 'అది ఇబ్నె హాతిమ్' అనే వ్యక్తి “ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! వారు తమ మతాచారులను మరియు మహర్షులను ఆరాధించటం లేదు." అని పలికాడు. అప్పుడు ప్రవక్త శల్లల్లాహు అలైహి వసల్లం “ఖచ్చితంగా ఆరాధిస్తున్నారు. ఆ యా మతాచారులు మరియు మహర్షులు ధర్మసమ్మతమైన వాటిని అధర్మమైనవిగా మరియు అధర్మమైన వాటిని ధర్మసమ్మతంగా చేశారు. ప్రజలు వారిని అనుసరించారు, అలా చేయటం ద్వారా వాస్తవంగా ఆ ప్రజలు వారిని ఆరాధించారు" (అహ్మద్ అథ్థిర్మిది హదీథ్ గ్రంథం, ఇబ్నె జరీర్ గ్రంథం, తఫ్సీర్ అత్తిబ్రీ Vol. 10, Page. 114)

    d) ప్రేమతో కూడిన దైవ భక్తిలో భాగస్వామ్యం: ఈ పద్ధతి ప్రకారం - కేవలం ఏకైక దైవమైన అల్లాహ్ పై చూపవలసిన ప్రేమాభిమానాలు, దైవభక్తి ఇతరుల పై చూపటం :

    దివ్యఖుర్ఆన్ లోని అల్ బఖరాహ్ (గోవు) అనే అధ్యాయం లోని 65వ వచనం (9:31) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు; “అయినా ఈ మానవులలో కొందరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా కల్పించుకుని, అల్లాహ్ ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తారు. కాని విశ్వాసులు అందరి కంటే అత్యధికంగా అల్లాహ్ నే ప్రేమిస్తారు. అయితే ఈ దుర్మార్గం చేస్తున్నవారు ప్రత్యక్షంగా చూడగలిగితే, ఆ కఠిన శిక్షను చూసినప్పుడు, వారు నిశ్చయంగా, సర్వశక్తి కేవలం అల్లాహ్ కే చెందును మరియు నిశ్చయంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు (అని తెలుసుకుంటారు) ."

    2) అష్షిర్క్ అల్ అస్గర్, అర్రియా (సామాన్య భాగస్వామ్యం) - ఘనతను చాటుకునే పనులు (show off చేయటం): కీర్తి, ఘనత, ప్రపంచ జీవితంలో ఉన్నత స్థానం పొందటం కోసం చేసే ప్రతి ఆరాధనా పద్ధతి లేక ధార్మిక ఆచరణ.

    దివ్యఖుర్ఆన్ లోని అల్ కహాఫ్ అనే అధ్యాయం లోని 110వ వచనం (18:110) లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు; (ఓ ప్రవక్తా!) ఇంకా ఇలా ప్రకటించు: 'నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడినే! నాపై దివ్యవాణి (వహీ) అవతరింపజేయ బడింది. నిశ్చయంగా, మీ ఆరాధ్య దేవుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే! కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాము(షరీక్)లు గా కల్పించుకోరాదు'"

    3) అష్షిర్క్ అల్ ఖఫీ (గుప్తమైన భాగస్వామ్యం) - అల్లాహ్ తప్పని సరిగా చేయమని ఆజ్ఞాపించిన వాటిపై లోలోపల అసంతృప్తిగా ఉండటం. ఫలానా పని చేస్తే బాగుండేది లేక చేయకపోతే బాగుండేది, ఫలానా వారి దగ్గరికి వెళ్ళితే బాగుండేది లేక వెళ్ళకపోతే బాగుండేది - అనే ఊగిసలాడుతుండే విచారకరమైన మనస్తత్వాన్ని కలిగి ఉండటం.

    ఒకసారి ప్రవక్త ముహమ్మద్ (శల్లల్లాహు అలైహి వసల్లమ్) ఇలా బోధించారు - “ముస్లిం ప్రజలలో గుప్తమైన భాగస్వామ్యం (అష్షిర్క్ అల్ ఖఫీ) అనేది రేచీకటిలో, కటిక నల్ల రాయి మీద మెల్లమెల్లగా పాకుతుండే నల్లటి చీమ కంటే ఎక్కువగా గుప్తమైనది" ఇటువంటి గుప్తమైన భాగస్వామ్యం నుండి రక్షణ పొందటానికి, ప్రతిరోజు మనం “ఓ అల్లాహ్! నీ ఆరాధనలో నా వలన జరిగబోయే ఎటువంటి భాగస్వామ్యం నుండైనా సరే, ముందుగానే నీ శరణు వేడుకుంటున్నాను. నాకు తెలియక చేసిన పాపాలకు పడే కఠినశిక్ష నుండి నీ క్షమాభిక్షను అర్థిస్తున్నాను - అని వేడుకోవలెను. "

    معلومات المادة باللغة العربية