Description
ఈ వ్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.
Digər tərcümələr 6
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం )
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అంటే ఎవరు?
“నిశ్చయంగా దైవప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమమైన ఆదర్శం ఉంది. అల్లాహ్ పట్ల మరియు అంతిమదినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే ప్రతి ఒక్కరి కోసం." ఖుర్ఆన్ 33:21
కేవలం సర్వలోక సృష్టికర్త (అరబీ భాషలో 'అల్లాహ్') ను మాత్రమే ఆరాధించమని మరియు ఆయనకు మాత్రమే విధేయత చూపమని ప్రజలను ఆహ్వానించేందుకు పంపబడిన ప్రవక్తల పరంపరలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిట్టచివరి ప్రవక్త అని ముస్లింలు విశ్వసిస్తారు. అలా పంపబడిన ప్రవక్తలలో కొందరి పేర్లు – ఆదము, నోవా, అబ్రహాము, ఇష్మాయీలు, ఇస్హాకు, జాకోబు, జోసెఫ్, మోసెస్, డేవిడ్, సోలోమాన్ మరియు జీసస్ (వారందరిపై శాంతి కురుయుగాక).
తోరా దివ్యగ్రంథంతో ప్రవక్త మోసెస్ అలైహిస్సలాం పంపబడినట్లుగానే గోస్పెల్ దివ్యగ్రంథంతో జీసస్ అలైహిస్సలాం పంపబడినారు. (ముస్లింలు ఈ రెండింటి అసలు, అవతరించిన, స్వచ్ఛమైన దివ్యగ్రంథాలను పూర్తిగా విశ్వసిస్తారు, కానీ వాటి స్థానంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న కలుషిత ప్రతులను కాదు). అలాగే ఖుర్ఆన్ దివ్యగ్రంథంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహ్ వసల్లం పంపబడినారని మరియు దానిని నిజజీవితంలో ఎలా ఆచరించాలో ఆయన బోధించారని ముస్లింలు మనస్పూర్తిగా విశ్వసిస్తారు.
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వభావం గురించి ఆయన భార్య ఆయెషా రదియల్లాహు అన్హాను ప్రశ్నించగా, 'నడుస్తున్న ఖుర్ఆన్' అని ఆమె జవాబిచ్చినారు. అంటే ఆయన ఖుర్ఆన్ దివ్యబోధనలను తన రోజువారీ జీవితంలో ఖచ్చితంగా ఆచరించి చూపినారు. ఆయన ఖుర్ఆన్ ఆయతులను దివ్యాచరణలలోనికి ఎలా అనువదించారనే కొన్ని నిదర్శనాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం.
మెర్సీ మిషన్
“(ఓ ముహమ్మద్) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము." ఖుర్ఆన్ 21:107
ప్రజలను నమాజు, ఉపవాసం, దానధర్మాలు మొదలైన వాటి వైపు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆహ్వానించడంతో పాటు, అల్లాహ్ పై విశ్వాసం అనేది ఇతరులతో ఎలా మెలగాలనే విషయాన్ని కూడా ప్రభావితం చేయాలని బోధించారు. ఇంకా ఆయనిలా ఉపదేశించారు: “మీలో ఎవరైతే ఉత్తమ గుణగణాలు కలిగి ఉంటారో, అలాంటి వారే మీలో ఉత్తములు."
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనేక బోధనలు దైవవిశ్వాసం మరియు ఆచరణల మధ్య ఉండవలసిన సంబంధం గురించి నొక్కి వక్కాణించాయి, ఉదాహరణకు: “ఎవరైతే అల్లాహ్ పై మరియు అంతిమ దినంపై విశ్వాసం ఉంచుతారో, వారు తన ఇరుగు పొరుగు వారిని బాధ పెట్టకూడదు, ఎవరైతే అల్లాహ్ పై మరియు అంతిమ దినంపై విశ్వాసం ఉంచుతారో, వారు తమ అతిథి మర్యాదగా చూసుకోవాలి మరియు ఎవరైతే అల్లాహ్ పై మరియు అంతిమ దినంపై విశ్వాసం ఉంచుతారో, వారు పలికితే మంచి మాటలే పలకాలి లేదా నిశ్శబ్దంగా ఉండాలి."
పరస్పరం గౌరవాభిమానాలతో మరియు కారుణ్యంతో మెలగాలని అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు బోధించారు:“ఇతరులపై కారుణ్యం చూపని వాడిపై, కారుణ్యం చూపబడదు."
మరోచోట, అవిశ్వాసులను శపించమని కొందరు ప్రజలు కోరగా, వారికి ఆయనిలా జవాబిచ్చారు: “నేను ఒకరిని శపించడానికి పంపబడలేదు, వారిపై దయ చూపడానికి మాత్రమే పంపబడినాను."
క్షమాగుణం
“వారిని క్షమించాలి మరియు మన్నింపు వైఖరిని అవలంబించాలి. అల్లాహ్ మిమ్ముల్ని క్షమిచాలని మీరు అభిలషించరా? అల్లాహ్ మాత్రం అమితంగా క్షమించేవాడూ, కరుణామయుడూను." (ఖుర్ఆన్ 24:22)
ప్రజలందరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత ఎక్కువగా క్షమించేవారు మరియు దయాదాక్షిణ్యాలు చూపేవారు. ఒకవేళ ఎవరైనా ఆయనను దూషిస్తే, ఆయన వారిని క్షమించేసేవారు. ఎదుటి వ్యక్తి ఎంత ఆగ్రహంతో ఉంటే ఆయన అంత కంటే ఎక్కువ ప్రశాంతంగా అతనితో ప్రవర్తించేవారు. ముఖ్యంగా ఆయనదే పైచేయి అయినప్పుడు మరియు ప్రతీకారం తీర్చుకునే శక్తి, అవకాశం కలిగి ఉన్నప్పుడు కూడా ఆయన తన విరోధులతో అత్యంత సౌమ్యంగా మరియు మృదువుగా, అత్యంత కనికరంతో వ్యవహించేవారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటేనే పూర్తి క్షమాగుణం మరియు ఆయనపై ఎంత పెద్ద దౌర్జన్యం జరిగినా, దాడి జరిగినా అది ఆయన క్షమాగుణం కంటే తక్కువ స్థాయిలోనే ఉండేది. ఖుర్ఆన్ లోని క్రింది వచనాలలో తెలిపినట్లుగా, ఇతరులను క్షమించడంలో ఆయనకు ఆయనే సాటి: “(ఓ ముహమ్మద్), మన్నింపు వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధిస్తూ ఉండు. మూర్ఖులను పట్టించుకోకు." (ఖుర్ఆన్ 7:199)
సమానత్వం
“నిశ్చయంగా ఎక్కువ భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువ ఆదరణీయుడు." ఖుర్ఆన్ 49:13
అల్లాహ్ దృష్టిలో మానవులందరూ సమానులేనని, క్రింది ఉపదేశాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు:
“మానవజాతి మొత్తం ఆదం నుండి వచ్చింది మరియు ఆదం మట్టి నుండి. ఒక అరబ్బుపై ఒక అరబ్బేతరునికి, ఒక నల్లవానిపై ఒక తెల్లవానికి ఎలాంటి ఆధిక్యత లేదు – దైవభీతి స్థాయిలో తప్ప."
“మీ రూపురేఖలు మరియు మీ సంపద చూసి అల్లాహ్ తీర్పు నివ్వడు, కానీ ఆయన మీ హృదయాలను చూస్తాడు మరియు మీ ఆచరణలను చూస్తాడు."
ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలో ఒకతను మరొక వ్యక్తితో “నల్లటి ఆడదాని కొడుకు!" అంటూ అసహ్యకరంగా మాట్లాడగా, వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోపంగా అతనితో ఇలా అన్నారు, “అతని తల్లి నలుపురంగు కారణం వలన అతనిని నిందిస్తున్నావా? ఇస్లాం ధర్మానికి ముందటి పూర్వకాలపు అజ్ఞానకాలపు ఛాయలు నీలో ఇంకా మిగిలి ఉన్నాయి."
సహనం, ఓర్పు
“మంచీ – చెడూ సమానం కాజాలవు. కాబట్టి చెడును మంచి ద్వారా తొలగించు. ఆ తర్వాత నీకూ – తనకూ మధ్య బద్ధవిరోధం ఉన్నతను సైతం నీకు ప్రాణస్నేహితుడై పోతాడు." ఖుర్ఆన్ 41:34
“నీకు అపకారం తలపెట్టిన వారికి బదులుగా నీవు అపకారం చేయకూడదు, కానీ వారిని క్షమించి, దయతో ప్రవర్తించు." ఇలానే ఆయన తనపై వ్యక్తిగతంగా జరిగిన దాడులకు మరియు దూషణలకు స్పందించారు.
తనకు కష్టం కలిగించిన వారితో ప్రతీకారం తీర్చుకునే అవకాశం లభించినా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయకుండా వారిని క్షమించి, దయతో వ్యవహరించారనే అనేక ఉదాహరణలు ఇస్లామీయ చరిత్రలో మనకు లభిస్తాయి.
ఆపదలు, దుర్దశ, దౌర్భాగ్య స్థితిలో సహనం, ఓర్పు వహించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు బోధించారు: “తన బలంతో ఇతరులపై ఆధిక్యత సంపాదించేవాడు బలమైనవాడు కాదు, కానీ కోపంలో తనను తాను నిగ్రహించుకోగలిగే వాడే బలమైనవాడు.."
సహనంతో, ఓర్పుతో శాంతంగా ఉండటమంటే ముస్లింలు ఉదాసీనులుగా మారాలని మరియు ఎవరైనా తనపై దాడి చేస్తే ఆత్మరక్షణ చేసుకోకూడదని కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, “శత్రువుతో పోరాడాలని కోరుకోవద్దు, కానీ ఒకవేళ అలా పోరాడవలసి వస్తే, సహనంతో పోరాడు (i.e. అంటే శత్రువును ఎదుర్కొనే టప్పుడు స్థిరంగా, నిలకడగా పోరాడు)."
సౌమ్యత, మృదుత్వం, హుందాతనం
“అల్లాహ్ దయ వలననే నీవు వారి పట్ల మృదుమనస్కుడవయ్యావు. ఒకవేళ నీవే గనుక కర్కశుడవు, కఠిన మనస్కుడవు అయి ఉంటే, వారంతా నీ దగ్గర నుంచి వెళ్ళి పోయేవారు." ఖుర్ఆన్ 3:159
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద దాదాపు పది సంవత్సరాల పాటు సేవకుడిగా పనిచేసిన ఒక సహచరుడు, ఆయన ఎల్లప్పుడు సౌమ్యంగా ప్రవర్తించేవారని సాక్ష్యం ఇచ్చారు. “నేను ఏదైనా పని చేసినప్పుడు, నేను ఆ పని చేసిన విధానాన్ని ఆయన ఎన్నడూ ప్రశ్నించలేదు; మరియు నేను ఏదైనా పని చేయలేక పోయినప్పుడు, ఆయన ఎన్నడూ ఎందుకు చేయలేదని ప్రశ్నించలేదు. ప్రజలందరితో ఆయన స్నేహపూర్వకంగా మెలిగేవారు."
ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్య ఆయేషా రదియల్లాహు అన్హాను అవమాన పరచగా, ఆమెకు చాలా కోపం వచ్చింది.
అది చూసి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకిలా సలహా ఇచ్చారు: “సౌమ్యంగా మరియు ప్రశాంతంగా ఉండు, ఓ ఆయెషా! వ్యవహారాలన్నింటిలో సౌమ్యంగా ప్రవర్తించడాన్ని అల్లాహ్ ఇష్టపడతాడు."
ఇంకా ఆయనిలా ఉపదేశించారు: “హుందాతనాన్ని, సౌమ్యాన్ని చూపండి! ఎందుకంటే దేనితోనైనా హుందాతనం, సౌమ్యం చేరితే, అది దాని అందాన్ని మరింత పెంచుతుంది. మరియు ఒకవేళ దేనిలో నుండైనా వాటిని తొలగిస్తే, అది లోపభూయిష్టంగా తయారవుతుంది."
అణుకువ, నమ్రత, వినయవిధేయతలు
“అనంత కరుణామయుని దాసులు ఎవరంటే, వారు నేలపై వినమ్రులై నడుస్తారు. మూర్ఖులు వారితో మాట్లాడినప్పుడు, వారితో 'మీకు సలాం' అంటూ సాగిపోతారు." ఖుర్ఆన్ 25:63
తన గౌరవార్థం ప్రజలు లేచి నిలబడటాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నివారించేవారు. సమూహంలో ఎక్కడ స్థానం లభిస్తే అక్కడే కూర్చునేవారు. అంతేగానీ, తన కోసం ప్రత్యేక ఎత్తైన స్థానం కావాలని ఎన్నడూ కోరలేదు. ఎన్నడూ తన సహచరులకు భిన్నంగా కనబడేలా ఆయన దుస్తులు ధరించలేదు మరియు వారి కంటే ఉన్నత స్థాయిలో ఉన్నట్లు ప్రదర్శించేందుకు కూడా ప్రయత్నించలేదు. బీదసాదలతో మరియు అక్కరగలవారితో ఇట్టే కలిసి పోయేవారు; ముసలివాళ్ళ వద్ద కూర్చునేవారు మరియు వితంతువులకు సహాయం అందించేవారు. ఆయన ప్రజలలో ఉన్నప్పుడు, ఆయన అంటే ఎవరో తెలియని క్రొత్తవారు ఆయనకు, మిగిలిన ప్రజలకు మధ్య ఎలాంటి భేదం గుర్తించలేక పోయేవారు.
సహచరులను సంభోదిస్తూ, ఆయనిలా పలికారు: “మీరు వినయవిధేయతలతో, నమ్రత, అణుకువలతో ఉండాలని అల్లాహ్ నాకు తెలియజేసినాడు. ఒకరిపై మరొకరు ప్రగల్భాలు, గొప్పలు చెప్పుకోకూడదు, ఒకరిపై మరొకరు దౌర్జన్యం చేయకూడదు."
ఆయన ఎంత ఎక్కువ అణుకువతో ఉండేవారంటే, ఎవరైనా తనను ఆరాధిస్తారేమోనని ఆయన చాలా భయపడేవారు ఎందుకంటే ఆరాధనలు కేవలం సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి. ఆయనిలా పలికేవారు:
“క్రైస్తవులు మర్యమ్ కుమారుడైన జీసస్ ను ప్రశంసించుటలో మితిమీరి పోయినట్లు, మీరు నన్ను ప్రశంసించుటలో హద్దులు మీరి పోకండి. నేను కేవలం అల్లాహ్ యొక్క దాసుడిని మాత్రమే; కాబట్టి నన్ను అల్లాహ్ యొక్క దాసుడు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త అని పిలవండి."
ఉత్తమ భర్త
“మరియు వారితో ఉత్తమరీతిలో కాపురం చేయండి." ఖుర్ఆన్ 4:19
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ భార్య ఆయెషా రదియల్లాహు అన్హా తన భర్త గురించి ఇలా పలికినారు: “ఆయన ఎల్లప్పుడూ ఇంటి పనిలో సహాయపడేవారు మరియు తన దుస్తులు తనే మడత పెట్టుకునేవారు, తన పాదరక్షలు తనే రిపేరు చేసుకునేవారు మరియు తనే నేల శుభ్రపరిచేవారు. ఇంకా పాలు పితికేవారు, తన పశువుల బాగోగులు చూసేవారు మరియు వాటికి మేత వేసేవారు. మరియు ఇంటి పనులలో పాలుపంచుకునేవారు."
స్వయంగా తను ఉత్తమ భర్తగా ప్రవర్తించడమే కాకుండా, తనను అనుసరించమని తన సహచరులకు కూడా ఆయన బోధించేవారు: “ఎవరైతే ఉత్తమ నైతిక ప్రవర్తన కలిగి ఉంటారో, అలాంటి వారే దైవవిశ్వాసంలో ఎక్కువ పరిపూర్ణులు. వారిలో కూడా ఎవరైతే తమ భార్యలతో ఉత్తమంగా ప్రవర్తిస్తారో, అలాంటి వారు మరింత ఎక్కువ ఉత్తములు."
ఆదర్శవంతుడు, రోల్ మోడల్
“నిశ్చయంగా నీవు (ఓ ముహమ్మద్) నైతిక ప్రవర్తన యొక్క అత్యుత్తమ ప్రమాణం." ఖుర్ఆన్ 68:4
తన జీవితంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా జీవించారనే దానికి పైప్రస్తావనలు కొన్ని మచ్చుతునకలు మాత్రమే. సాటి లేని ఆయన దయాదాక్షిణ్యాల, ఉత్తమ నైతిక ప్రవర్తనల ఉదాహరణలు ఇస్లాం గురించి మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిని మరియు నిరంతరం వక్రీకరించేవారిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు తిన్నగా దాని అసలు మూలాల వద్దకు వెళ్ళి పరిశోధించడమనేది చాలా ముఖ్యమైన విషయం, ఆ మూలాలు: ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు. అంతేగాని కొందరు ముస్లింల తప్పుడు చేష్టలను ఆధారంగా చేసుకుని ఇస్లాం ధర్మం గురించి తీర్మానించుకోకూడదు.
కొందరు ముస్లిమేతరుల వ్యాఖ్యానాలు
భారతదేశ స్వాతంత్ర ఉద్యమం యొక్క రాజకీయ మరియు అధ్యాత్మిక నాయకుడైన మహాత్మా గాంధీ ఇలా వ్యాఖ్యానించారు: “ప్రవక్త యొక్క దృఢమైన నిరాడంబరత మరియు పరిపూర్ణమైన ఆత్మ ప్రక్షాళన, ఇచ్చిన హామీలను మరిచిపోని సూక్ష్మబుద్ధి, తన సహచరుల మరియు మిత్రుల కోసం ప్రత్యేక శ్రద్ధ, ధైర్యసాహసాలు, నిర్భయం మరియు వీరత్వం, అల్లాహ్ పై మరియు తన దౌత్యలక్ష్యంపై ఆయన యొక్క స్వచ్ఛమైన, సంపూర్ణమైన మరియు దృఢమైన విశ్వాసం – ఇవే గానీ ఖడ్గం కాదు ప్రతి దాన్నీ వారి ముందుకు మోసుకు వచ్చింది మరియు ప్రతి ఆటంకాన్నీ, అవరోధాన్నీ అధిగమించింది మరియు జయించిందీను."
జార్జ్ బెర్నార్డ్ షా, బ్రిటీష్ నాటక రచయిత ఇలా ప్రకటించినాడు: “ఈనాటి ప్రపంచానికి ముహమ్మద్ మెదడు వంటి మెదడు కలిగి ఉన్న మానవుడి అవసరం అత్యంత అధికంగా ఉన్నది; మధ్యయుగ కాలపు ప్రజలు తమ అజ్ఞానం, దురభిప్రాయం మరియు పక్షపాతం వలన ఆయన గురించి చాలా చెడుగా చిత్రీకరించారు. ఎందుకంటే వారు ఆయనను క్రైస్తవ మత విరోధిగా భావించేవారు. కానీ, ఆ మహాపురుషుడి వృత్తాంతాన్ని చూసిన తర్వాత, నేను దానిని ఆశ్చర్యకరమైనదిగా, ఉల్లాసకరమైనదిగా మరియు అద్భుతమైనదిగా గుర్తించి, ఆయన ఎన్నడూ క్రైస్తవ మత విరోధి కాదనీ, ఆయన తప్పనిసరిగా మానవజాతి ఉద్ధారకుడు మరియు రక్షకుడు అనే పేర్లతో పిలవబడాలనే నిర్ధారణకు వచ్చాను. నా అభిప్రాయం ప్రకారం, ఈనాటి ప్రపంచంపై ఆయనకు గనుక మరొక్కసారి ఆధిపత్యం ఇస్తే, మన సమస్యలన్నింటినీ ఆయన చక్కగా పరిష్కరించి వేస్తాడు, ప్రపంచం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శాంతీ, సంతోషాలను స్థాపిస్తాడు."
http://islamicpamphlets.com/prophet-muhammad/#more-207